దేశంలో కరోనా తీవ్రత, తీసుకుంటున్న చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. దేశరాజధాని దిల్లీతోపాటు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా ప్రభావంపై చర్చించారు.
మొత్తం కేసుల్లో మూడింట రెండొంతులు 5 రాష్ట్రాల్లోని పెద్ద నగరాల్లోనే నమోదైనట్లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో కేసుల పెరుగుదలను నియంత్రించేందుకు నిర్ధరణ పరీక్షల సంఖ్య పెంచడంపై ఈ భేటీలో చర్చించారు. ఆసుపత్రి పడకలతోపాటు వైద్య సేవలను మరింత పెంచాలని సూచించారు ప్రధాని.
ఆసుపత్రులపై..
జిల్లాలు, నగరాల వారీగా ఆసుపత్రి పడకలు, ఐసొలేషన్ బెడ్ల అవసరాలకు సంబంధించిన వివరాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదించి ఇందుకు అవసరమైన అత్యసవర చర్యలను తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖను ఆదేశించారు.
దేశంలో కరోనా కేసులు 2 లక్షలకు చేరిన 10 రోజులకే 3 లక్షల మార్కును దాటింది. రికార్డు స్థాయిలో శనివారం ఒక్కరోజులో 11,458 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 8,884 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దిల్లీలో కేసుల సంఖ్య 36,824కు చేరుకుంది.
దేశ రాజధానిపై చర్చ..
దిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రితో కేంద్ర హోంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి అత్యవసర భేటీని నిర్వహించాలని ప్రధాని ఆదేశించారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర అధికారులు పాల్గొనాలని సూచించారు. కరోనా కేసుల సంఖ్యను తగ్గించేందుకు సమన్వయంతో కూడిన సమగ్ర స్పందన ప్రణాళికను అమలు చేయాలని నిర్దేశించారని పీఎంఓ తెలిపింది.