భాజపా ప్రభుత్వం అనుకున్నది సాధిస్తుందని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇందుకు అయోధ్య రామమందిర నిర్మాణమే నిదర్శనమని పేర్కొన్నారు. అయోధ్యలో ఆలయ నిర్మాణం మొదలైందని.. ఇంతకాలం తమను ప్రశ్నించిన వారు ఇప్పుడు చప్పట్లతో తమ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారని తెలిపారు.
బిహార్ దర్భంగాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని. ఈ నేపథ్యంలో విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారి పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉండేదన్నారు. రాష్ట్రంలోకి ఆటవిక రాజ్యాన్ని తీసుకొచ్చిన వారిని మరోమారు ఓడిద్దామని ప్రజలు నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
"గత ప్రభుత్వాలు అభివృద్ధిని పట్టించుకోలేదు. అధికారంలో ఉన్నప్పుడు డబ్బే మంత్రంగా పనిచేశారు. 'కమిషన్' అన్న పదం అంటే వారికి ఎంతో ప్రేమ. దానిని పట్టుకుని 'కనెక్టివిటీ'ని మర్చిపోయారు. మిథిలాను జోడించే కోసి మహాసేతుకు ఏమయిందో మీకు తెలిసిందే."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
బిహార్ అభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉందన్న ప్రధాని.. రాష్ట్ర సంక్షేమానికి ఉపయోగించే నిధులను దోచుకోవాలనుకుంటున్న వారితో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.