నరేంద్రమోదీ అహంకారం సమస్యతో బాధపడుతున్నారని, ప్రధానమంత్రిలా కంటే ఎక్కువగా ప్రచారాల మంత్రిగానే వ్యవహరిస్తున్నారని రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ భయంతో ఉన్నట్లు ఆయన ప్రవర్తనలో తెలుస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరోపించారు.
ఎన్నికల అనంతరం 'రాహులే ప్రధానమంత్రి' అన్న అభిప్రాయంపై స్పందించారు కాంగ్రెస్ అధ్యక్షులు. దీని గురించి మాట్లాడటం అహంకారం అవుతుందని, ప్రజలే అంతిమ నిర్ణేతలని వ్యాఖ్యానించారు. అదే సమయంలో మోదీపై విమర్శల వర్షం కురిపించారు.
''మోదీకి ఉన్న అహంకారం, అధికార దాహం, స్వంత ప్రచారం విఫలమౌతున్నపటికీ దానిపై ఉన్న ఆసక్తి, భారత్‌లోని ప్రతి ఒక్కరి సమస్యకు తనవద్దే పరిష్కారం ఉందనే అపనమ్మకం వల్ల ఎవరినీ సంప్రదించకపోవటం వల్ల ప్రధానమంత్రి సమస్యలను ఎదుర్కొంటున్నారు.''
లోక్‌సభ ఎన్నికల ముందు చివరిసారిగా ప్రధానమంత్రికి ఇచ్చే సందేశంపై అడగగా... తనదైన శైలిలో విరుచుకుపడ్డారు రాహుల్. నిరుద్యోగం, రైతులు, ఆర్థిక వ్యవస్థ వైఫల్యం, మోదీ వ్యక్తిగత అవినీతిలే తన సందేశమని సమాధానమిచ్చారు. దీంతోపాటు ఎన్నికలను ప్రభావితం చేయగల అంశాలపై స్పష్టతనిచ్చారు.
''సంస్థలను నాశనం చేయటం, ద్వేషం పెరగటం, సమాజంలో హింస, షెడ్యూల్డ్ తరగతుల హక్కులపై దాడి లాంటి తదితర అంశాలను ఓటర్లు పరిగణనలోకి తీసుకుంటారు. 2014లో ఇచ్చిన తప్పుడు హామీలు, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల జమ ప్రకటన, 2 కోట్ల ఉద్యోగాల సృష్టి, 100 స్మార్ట్ సిటీల నిర్మాణం, విదేశాల్లో ఉన్న 80 లక్షల కోట్ల నల్లధనాన్ని వెనక్కి తెప్పించటం లాంటివే ఎన్నికలకు ప్రధాన అంశాలు.''
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనీస ఆదాయ పథకం న్యాయ్(న్యూన్తమ్ ఆయ్ యోజన) అమలు చేస్తామని ఇటీవలే ప్రకటించారు రాహుల్‌గాంధీ.
"భాజపా సృష్టించిన కారు చీకట్ల మధ్య కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన న్యాయ్ ఒక వెలుగురేఖ. దీనికి ఆర్థిక వ్యవస్థను మార్చే శక్తి ఉంది. ఇది ఎన్నికలకు కీలకమైన అంశంగా మారుతుంది."
-
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
పుల్వామా దాడుల అనంతరం పరిస్థితుల వల్ల ఎన్నికల్లో ప్రజలు భాజపా వైపు ఉన్నట్లు పలు ఊహాగానాలున్నాయని, దీనికి మీడియాలో మోదీ చేస్తున్న ప్రచారమే కారణమని అన్నారు.
"ఒక రకమైన వాదనను మాత్రమే ప్రచారం చేయాలని ప్రధానమంత్రి కార్యాలయం మీడియాపై ఒత్తిడి చేస్తోంది. మీడియాలో కొందరు దీనిపై పోరాడుతున్నారు. ఉద్యోగాల సృష్టి, రైతు సంక్షోభం, ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థలపై చర్యలు తీసుకోవటంలో నరేంద్రమోదీ విఫలమయ్యారని క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు తెలుపుతున్నాయి. " -రాహుల్ గాంధీ
న్యాయ్ పథకం, ఉద్యోగాల సృష్టి.. విద్యా, ఆరోగ్య రంగంలో పెట్టుబడులు, రైతు సంక్షోభం నివారణకు చర్యలు లాంటి అంశాలపై ఎన్నికల్లో గెలుపుబావుటా ఎగురవేస్తామని అన్నారు.
అవినీతిపై పోరాటం అనే హామీతో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన మోదీ.... అవినీతిని ప్రోత్సహించటానికి కావాల్సినన్ని చర్యలు తీసుకున్నారు. వాటికి ఓ ఉదాహరణే ఎన్నికల బాండ్లు.
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 44 లోక్‌సభ సీట్లను మాత్రమే గెలుచుకుంది. ప్రస్తుతం ఎన్నికలు ఎంత వరకు ముఖ్యం అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు.
2014 తరవాత పార్టీ పునర్నిర్మాణం కోసం పనిచేశాం. ఇందులో భాగంగా వికేంద్రీకరణ చేపట్టాం. ప్రజలతో సంభాషించటానికి సాంకేతికత సహాయం తీసుకుంటున్నాం. అందులో ఒకటైన 'శక్తి యాప్'లో ప్రస్తుతం కోటి మంది కార్యకర్తలు నమోదై ఉన్నారు.
ఇదీ చూడండి :వయనాడ్ నుంచి రాహుల్... సంబరాల్లో కార్యకర్తలు