భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతిపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు ప్రధాని నరేంద్రమోదీ. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వరుస ట్వీట్లు చేశారు.
"నేర్పు, హాస్య చతురత, ప్రజాకర్షణ శక్తి జైట్లీ సొంతం. అన్ని వర్గాల ప్రజలు జైట్లీని అభిమానిస్తారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. భారత రాజ్యాంగం, చరిత్ర, పరిపాలనపై విశేష అవగాహన ఉంది.
సుదీర్ఘ రాజకీయ జీవితంలో జైట్లీ అనేక మంత్రిత్వశాఖల బాధ్యతలు పర్యవేక్షించారు. తద్వారా భారత ఆర్థిక ప్రగతి, రక్షణపరంగా దేశ సామర్థ్యాన్ని పెంచడం, ప్రజానుకూల చట్టాల రూపకల్పన, ఇతర దేశాలతో వాణిజ్య బంధాల బలోపేతంలో తన వంతు తోడ్పాటు అందించారు.
భాజపా, అరుణ్ జైట్లీ బంధం అవిభాజ్యమైంది. విద్యార్థి నేతగా ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ముందు వరుసలో నిలిచారు. పార్టీ సిద్ధాంతాలను సమాజంలోని అత్యధిక వర్గాలకు చేరువచేయగల వ్యక్తిగా, అభిమాన నేతగా ఎదిగారు.
అరుణ్ జైట్లీ మృతితో నేను ఒక విలువైన స్నేహితుడ్ని కోల్పోయాను. వేర్వేరు అంశాలపై అవగాహన కలిగి ఉండే విషయంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన సంతోషంగా జీవించారు. మనకు ఎన్నో ఆనందకర జ్ఞాపకాల్ని మిగిల్చారు."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
.
ఇదీ చూడండి: ఆఖరి క్షణం వరకు కాషాయ సైనికుడిగానే సేవలు...