భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నిర్వహించిన వర్చువల్ సదస్సులో భాగంగా.. ఇరు దేశాలు 7 ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. భారత్-బంగ్లాదేశ్ మధ్య వేగంగా పెరుగుతున్న బంధానికి ఈ ఒప్పందాలు ప్రతిబింబంగా నిలిచాయి.
హైడ్రోకార్బన్, వ్యవసాయం, టెక్స్‌టైల్‌తో పాటు వివిధ రంగాల్లో ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి ఇరు దేశాలు. వీటితో పాటు చిలాహటి-హల్దిబరి రైల్వే లింక్‌ను వర్చువల్ సదస్సు వేదికగా పునరుద్ధరించారు ఇరువురు నేతలు. భారత్‌లోని అసోం, బంగాల్‌ను బంగ్లాదేశ్‌కు అనుసంధానిస్తుంది ఈ రైల్వే లింక్.
అనంతరం బంగ్లాదేశ్ వ్యవస్థాపకులు ముజీబుర్ రెహ్మాన్, భారత జాతిపిత మహాత్మా గాంధీ జీవితాల ఆధారంగా రూపొందించిన డిజిటల్ ఎగ్జిబిషన్‌ను మోదీ-హసీనా ఆవిష్కరించారు. ముజిబుర్ స్మారక స్టాంప్‌ను కూడా ఇరువురు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ.. తమ విదేశీ విధానాల్లో బంగ్లాదేశ్‌కు తొలి ప్రాధాన్యమిచ్చినట్టు వెల్లడించారు.
"'పొరుగు దేశాలే ప్రథమం' అన్న మా ప్రభుత్వ విధానంలో బంగ్లాదేశ్‌కు పెద్ద పీట వేశాం. నేను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే.. బంగ్లాదేశ్‌తో బంధం బలపరచుకునే అంశానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చాను."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
భారత్‌ను నిజమైన స్నేహితుడిగా అభివర్ణించారు బంగ్లాదేశ్ ప్రధాని హసీనా.
ఇదీ చూడండి:- విజయ్ దివస్: భారత శక్తి... బంగ్లాదేశ్ విముక్తి!