ఉత్తర్ ప్రదేశ్లోని పీఎం స్వానిధి లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ముచ్చటించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ కార్యక్రమంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొననున్నారు.
కరోనాతో దెబ్బ తిన్న వీధి వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్రం ప్రకటించిన పథకమే ఈ స్వానిధి (పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి).
ఇప్పటివరకు ఈ పథకానికి మొత్తం 24 లక్షలకుపైగా దరఖాస్తులు అందినట్లు ఆదివారం ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) ప్రకటించింది. అందులో 12 లక్షల వీధి వ్యాపారులకు రుణాలు మంజూరైనట్లు తెలిపింది. 5.35 లక్షల మందికి రుణాలు పంపిణీ కూడా అయినట్లు వివరించింది. ఒక్క ఉత్తర్ప్రదేశ్ నుంచే 6 లక్షల దరఖాస్తులు రాగా.. అందులో 3.27 లక్షల మందికి రుణాలు మంజూరు చేసినట్లు పీఎంఓ తెలిపింది. 1.87 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు పంపిణీ చేసినట్లు పేర్కొంది.
విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో మోదీ ప్రసంగం..
విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా.. మంగళవారం విజిలెన్స్, అవినీతి నిరోధక జాతీయ కాన్ఫరెన్స్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమంలో మోదీ ప్రసంగించనున్నారు.
ఇదీ చూడండి:ఎల్టీసీ క్యాష్ ఓచర్లపై ఆర్థిక శాఖ స్పష్టత