హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్‌లో నిర్మించిన సొరంగ మార్గం 'అటల్ టన్నెల్'ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గమైన దీనికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పేరు పెట్టారు. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం ఈ ఏడాది మే నెలలో ఇది ప్రారంభంకావాలి. కొవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా కొద్ది నెలలు ఆలస్యమైంది.
ప్రధాని పర్యటన నేపథ్యంలో శుక్రవారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రోహ్‌తంగ్‌లో పర్యటించారు. సొరంగ మార్గం ప్రారంభోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. భద్రతా దళాలు వేగంగా సరిహద్దులను చేరుకోవడంలో ఈ మార్గం ఎంతో కీలకమైంది. వ్యూహాత్మకంగానూ ఎన్నో ప్రయోజనాలున్న ఈ అటల్ టన్నెల్ హిమాచల్‌ప్రదేశ్‌లో మనాలీ, లద్దాఖ్‌లో లేహ్‌ను అనుసంధానిస్తుంది. సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది.
మొదట ఆరు సంవత్సరాల్లో పూర్తి చేద్దామని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. టన్నెల్ పూర్తి కావడానికి పదేళ్లు పట్టిందని అధికారులు తెలిపారు. టన్నెల్ లోపల ప్రతి 60 మీటర్లకు ఒక సీసీ కెమెరా ఉందని పేర్కొన్నారు. ప్రతి 500 మీటర్లకు అత్యవసర నిష్క్రమణ మార్గం(ఎమర్జెన్సీ ఎగ్జిట్) ఉంటుందని చెప్పారు. ఈ టన్నెల్ వల్ల మనాలీ, లేహ్ మధ్య దాదాపు 46 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని, తద్వారా 4 గంటల సమయం ఆదా అవుతుందని స్పష్టం చేశారు.