సెప్టెంబర్ 20-23 మధ్య నిర్వహించే ఐక్యరాజ్య సమితి వార్షిక సదస్సుకు హాజరయ్యేందుకు అమెరికా వెళ్లనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ పర్యటనలో భాగంగా హ్యూస్టన్లో భారత సంతతి సమాజంతో భేటీ కానున్నారు. సెప్టెంబర్ 22న నిర్వహిస్తున్న 'హౌడీ, మోదీ' భారత సంతతి కమ్యూనిటీ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ మేరకు కార్యక్రమ నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేశారు.
అమెరికాలో సుమారు 5 లక్షల మందికి పైగా భారత సంతతికి చెందిన వారు ఉంటే... అందులో అధిక శాతం హ్యూస్టన్లోనే ఉన్నారు. ఈ కార్యక్రమానికి వేల మంది హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
హౌడీ అంటే..
'హౌడీ, మోదీ' అనేది టెక్సాస్ ఇండియా ఫోరమ్ నిర్వహిస్తున్న భారత సంతతి కమ్యూనిటీ సదస్సు. హౌడీ- అంటే ఎలా ఉన్నారు (హౌ డూ యూ డూ?) అనేదానికి సంక్షిప్త పదం. స్నేహపూర్వక పలకరింపుగా వాయవ్య అమెరికాలో ఈ పదం ఎక్కువగా వాడుకలో ఉంది.
ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎలాంటి రుసుము వసూలు చేయట్లేదని తెలిపారు నిర్వాహకులు. కానీ ఆన్లైన్ ద్వారా అందించే పాసులను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అమెరికాలోని భారత సంతతి కమ్యూనిటీతో మోదీ సమావేశమవటం ఇది మూడోసారి.
ఇదీ చూడండి: జాదవ్ విడుదలకు నిర్విరామ కృషి: భారత్