బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయ ఢంకా మోగించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్ర ప్రజలకు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.
"బిహార్లో నూతన శకం మొదలైందని యువత నిరూపించారు. అభివృద్ధే బిహార్ ప్రజల ఆకాంక్ష అని చాటారు. 15ఏళ్లయినా ప్రజలు ఎన్డీఏ సుపరిపాలన చూసి పట్టం కట్టారు. వివక్షకు తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరిని అభివృద్ధి పథంలోకి ఎన్డీఏ ప్రభుత్వం నడిపిస్తుందని హామీ ఇస్తున్నా."
----- ట్విట్టర్లో ప్రధాని నరేంద్ర మోదీ
మరోవైపు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో భాజపా విజయంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. గుజరాత్లో భాజపా 8సీట్లను కైవసం చేసుకుంది. గుజరాత్ ప్రజలకు భాజపాకు విడదీయలేని బంధం ఉందని పేర్కొన్నారు.
బంధం వెలకట్టలేనిది..
మధ్యప్రదేశ్లో భాజపా విజయానికి పార్టీ కార్యకర్తలు నిరంతరం శ్రమించారని తెలిపారు. పార్టీతో ప్రజలకు ఉన్న బంధం వెలకట్టలేనిదని పేర్కొన్నారు.
కర్ణాటకలో ఉప ఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లోనూ భాజపా గెలుపొందింది. ప్రజలు పార్టీపై నమ్మకం ఉంచారని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉత్తర్ప్రదేశ్లో ఎన్నికలు జరిగిన 7 స్థానాల్లో కమలం 6 స్థానాలను కైవసం చేసుకుంది. పార్టీ కార్యకర్తల కృషిని ప్రధాని కొనియాడారు.
చారిత్రక విజయం
మణిపుర్లో కమలం విజయం సాధించటంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం 5స్థానాలకు భాజపా నాలుగింట గెలిచింది.