జాతిపిత మహాత్మాగాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ అక్టోబర్ 2న గుజరాత్లో పర్యటించే అవకాశముంది. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.
" సబర్మతీ ఆశ్రమంలో అక్టోబర్ 2న జరిగే ప్రార్థనల్లో మోదీ పాల్గొననున్నారు. అనంతరం సర్పంచ్ల సభలో ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి దేశ వ్యాప్తంగా అన్ని గ్రామాల సర్పంచ్లు పాల్గొనే అవకాశముంది. ప్రధానంగా గ్రామాల్లో పరిశుభ్రతపై గాంధీ అందించిన సందేశాన్ని వివరించనున్నారు ప్రధాని. "
- ఓ ప్రభుత్వ అధికారి
త్వరలోనే అధికారిక ప్రకటన
మంగళవారం గుజరాత్ పర్యటన అనంతరం దిల్లీకి తిరుగుపయనమయ్యే ముందు.. విజయ్ రూపానీతో పాటు ఆ రాష్ట్ర అధికారులతో సమావేశమయ్యారు మోదీ. ఈ భేటీలో గాంధీ జయంతి ఉత్సవాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ప్రధాని పర్యటనపై గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే అతి త్వరలోనే ఈ కార్యక్రమంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.