కోట్లాదిమంది హిందువుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ.. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వేదమంత్రాల నడుమ.. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాలకు భూమిపూజను నిర్వహించారు ప్రధాని.
175 మంది అతిథుల సమక్షంలో.. గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించారు మోదీ. ఆ సమయంలో మోదీ వెంట ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్, నృత్యగోపాల్ దాస్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రమే ఉన్నారు.
కరోనా కారణంగా విధించిన నిబంధనలతో అయోధ్యకు చేరుకోలేని భక్తులు.. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. శంకుస్థాపన మహోత్సవాన్ని కళ్లారా చూసి పులకరించిపోయారు.
సాష్టాంగ నమస్కారం...
అంతకుముందు.. లఖ్నవూ నుంచి హెలికాఫ్టర్ ద్వారా అయోధ్యకు చేరుకున్న మోదీకి సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇరువురు.. హనుమాన్గఢీ ఆలయాన్ని సందర్శించారు. హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మోదీ.
అనంతరం రామ జన్మభూమి ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని.. రామ్లల్లా విగ్రహం ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. అత్యద్భుతంగా అలంకరించిన రాముని ప్రతిమకు పూజలు నిర్వహించారు. అదే ప్రాంగణంలో పారిజాత మొక్కను కూడా నాటారు.
ఇవీ చూడండి:- శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కథేంటి?