ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కొవిడ్-19 పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్‌తో చర్చించారు. ఈ సంక్షోభంలో ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకుంటూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని ఇరువురు నొక్కి చెప్పారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న చర్చల్లో భారత్‌ను భాగం చేయాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు భారత్ అనుసరిస్తున్న వ్యూహాలు, ప్రణాళికల్ని బిల్ గేట్స్‌కు మోదీ వివరించారు.
భారత్‌లో ప్రజల భాగస్వామ్యంతోనే కరోనాపై పోరు కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. భౌతిక దూరం పాటించడం, శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం, మాస్కులు ధరించడం, నిబంధనల్ని తప్పకుండా పాటించడం, పోరులో ముందున్న వారిని సముచితంగా గౌరవించడం వంటి చర్యల్లో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రధాని వివరించారు. అలాగే ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం, పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఆయుర్వేదం ద్వారా ప్రజల్లో రోగనిరోధక శక్తి పెంచేలా అవగాహన కల్పించడం వంటి ప్రభుత్వ చర్యలు మహమ్మారిని పారదోలేందుకు ఉపయోగపడుతున్నాయని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిని ఎదుర్కొనేందుకు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాల్ని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రశంసించారు. వైరస్‌ను ఓడించేందుకు భారత్ మరింత సమర్థంగా ఎలా పనిచేయగలదో సూచించాలని బిల్ గేట్స్‌ను మోదీ కోరారు. కొవిడ్-19 అనంతర ప్రపంచంలో రాబోయే మార్పుల్ని విశ్లేషించి మార్గదర్శనం చేయడంలో గేట్స్ ఫౌండేషన్ చొరవ తీసుకోవాలని మోదీ సూచించారు.