బిహార్ అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రంలో 541 కోట్ల రూపాయలతో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేపట్టిన ఏడు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో మోదీతో పాటు, కేంద్ర మంత్రి రవిశంకర్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
పట్టణీకరణ ప్రస్తుత కాలానికి చాలా అవసరం. దీనిని దశాబ్దాల నుంచి ఒక సమస్యగా భావిస్తున్నారు. కానీ నేను అలా అనుకోను. దీనిని సమస్యగా భావించినప్పటికీ చాలా అవకాశాలకు మూలాధారం. బీఆర్ అంబేద్కర్ పట్టణీకరణకు ఎంతో మద్దతునిచ్చారు .
నరేంద్ర మోదీ, ప్రధాని.
రాష్ట్రంలో చాలా దూరదృష్టి కలిగిన నాయకులు ఉన్నారని, కానీ కొంత మంది స్వార్థ నేతల నుంచి పాలన మారటానికి ఒక యుగం పట్టిందని గత పాలకులపై విరుచుకుపడ్డారు ప్రధాని.
స్వార్థ ప్రయోజనాలు కలిగిన పాలకులు అధికారంలోకి వచ్చి ఓటు-బ్యాంకు రాజకీయాలు చేసి వ్యవస్థను నాశనం చేశారని మోదీ ధ్వజమెత్తారు. లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ 15 ఏళ్ల నాటి పరిపాలన గురించి ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఎంతో కృషి చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు.
మొత్తం ఏడు ప్రాజెక్టుల్లో నాలుగు నీటి సరఫరాకు సంబంధించినవి కాగా... 2 మురుగునీటి శుద్ధికి, ఒకటి నదీ పరివాహక ప్రాంత అభివృద్ధికి సంబంధించినది. గంగా పరివాహక ప్రాంతంలో 20కి పైగా పట్టణాలు ఉన్నాయి. పవిత్ర నదిని శుభ్రం చేయటం కోసం రూ.6 వేల కోట్లతో 50 ప్రాజెక్టులను ఆమోదించినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు మోదీ.