భారత సరిహద్దుల్లోకి ఎవరూ చొరబడలేదంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యను కాంగ్రెస్ తప్పుపట్టింది. అది చైనా వాదనతో ఏకీభవించినట్లయిందని విమర్శించింది. హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నా చొరబాట్లు జరిగాయని చెప్పేందుకు ప్రభుత్వం నిరాకరించటం మానుకోవాలని సూచించారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్. సరిహద్దులో చైనా తగ్గి, యథాతథ స్థితిని పునరుద్ధరించే వరకు వెనక్కి తగ్గొద్దని పేర్కొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత.
" గల్వాన్ లోయ మొత్తం తమదేనని చైనా చెబుతున్న తరుణంలో ఎవరూ చొరబడలేదని ప్రధాని ఎలా చెబుతారు? ప్రధాని చేసిన ప్రకటన సైనికుల శౌర్యం, త్యాగాలను అవమానపరిచేదిగా ఉంది. చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడ్డారని అంతకుముందు రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి, ఆర్మీ చీఫ్ చేసిన ప్రకటనలకు ప్రధాని వ్యాఖ్యలు విరుద్ధంగా ఉన్నాయి. సరిహద్దులో మునుపటి పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. "
- కపిల్ సిబల్, కాంగ్రెస్ సీనియర్ నేత.
భారత ప్రాదేశిక సమగ్రత విషయంలో యావత్ దేశం మొత్తం ప్రభుత్వంతో కలిసి నడుస్తుందన్నారు కపిల్ సిబల్. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామన్నారు.
ఇదీ చూడండి: భారత్- చైనా సరిహద్దు సమస్యకు అసలు కారణమేంటి?