బోడో శాంతి ఒప్పందం అమలుకు భాజపా, ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటును అంతమొందించే ప్రక్రియను బోడోల్యాండ్ ప్రాదేశిక మండలి(బీటీసీ) ఏడాది క్రితమే ప్రారంభించిందని గుర్తుచేశారు. గతంలో కాంగ్రెస్.. బోడోలతో ఎన్నో ఒప్పందాలు కుదుర్చుకుందని.. అయితే వాటిని అమలు చేయడంలో విఫలమైందని ఎండగట్టారు.
బీటీఆర్ అకార్డ్ డే వేడుకల్లో పాల్గొన్న షా.. అసోంలోని అన్ని వర్గాల ప్రజల రాజకీయ హక్కులు, సంప్రదాయలు, భాషలకు భాజపా ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందన్నారు. ఈ మేరకు మోదీ సర్కారు ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందన్నారు. భాజపా హయంలోనే అసోం.. ఉగ్రవాద రహిత, అవినీతి రహిత, కాలుష్య రహిత రాష్ట్రంగా తయారవుతోందన్నారు.
"బీటీసీ ఒప్పందాన్ని అమలు చేయడానికి భాజపా, ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారు. ఇది బోడోల్యాండ్లో శాంతి, అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుంది. దీంతో ఈ ప్రాంతంలో తిరుగుబాటు ముగింపునకు నాంది పలుకుతుంది."
- అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి
ఇదీ చూడండి: రైతులకు మద్దతుగా మహారాష్ట్రలో కిసాన్ మార్చ్