బిహార్ ప్రతిపక్ష కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆర్జేడీ పాలనలో రాష్ట్రంలో అశాంతి నెలకొందని ఆరోపించారు. బిహార్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా నష్టపరిచిన చరిత్ర గల వారిని తిరిగి అధికారంలోకి రానివ్వకూడదని ప్రజలు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు మోదీ.
బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సాసారమ్ బైదా మైదానంలో నిర్వహించిన తన తొలి బహిరంగ సభలో ప్రసంగించారు ప్రధాని మోదీ. ముందుగా.. దివంగత కేంద్ర మంత్రి రాంవిలాస్ పాసవాన్, బాబు రఘువంశ్ ప్రసాద్ సింగ్‌లకు నివాళులర్పించారు. ఆర్టికల్ 370ని విపక్షాలు పునరుద్ధరిస్తామని పేర్కొనటంపై తీవ్ర విమర్శలు చేశారు. దళారులు, మధ్యవర్తులను కాపాడేందుకే నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
"ఎన్నికలకు ముందే బిహార్ ప్రజలు తమ.. నిర్ణయాన్ని సూత్రప్రాయంగా వెల్లడించారు, రాష్ట్రంలో మళ్లీ ఎన్డీఏనే అధికారం చేపడుతుందని అన్ని సర్వేలు సూచిస్తున్నాయి. రాష్ట్రాన్ని తీవ్రంగా నష్టపరిచిన చరిత్ర ఉన్నవారిని తమ దగ్గరికి రానివ్వకూడదని బిహార్ ఓటర్లు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒకప్పుడు బిహార్‌ను పాలించిన వారు మళ్లీ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని తమ అత్యాశ కళ్లతో చూస్తున్నారు. అవినీతి, అశాంతితో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టిన విషయాన్ని బిహార్ ప్రజలు మరిచిపోకూడదు. ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. వారు(కాంగ్రెస్) అధికారంలోకి వస్తే.. తిరిగి తీసుకొస్తామని చెప్పారు. ఆ వ్యాఖ్యల తర్వాత బిహార్‌లో ఓట్లు అడుగే సాహసం చేస్తున్నారు. అది బిహార్‌ను అవమానించినట్లు కాదా? దేశాన్ని కాపాడేందుకు బిహార్ తన కుమార్తెలు, కుమారులను సరిహద్దులకు పంపుతోంది."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.
బిహార్ ప్రజలు.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కరోనా మహమ్మారిని సమర్థంగా కట్టడి చేయగలుగుతున్నారని పేర్కొంటూ వారికి శుభాకాంక్షలు తెలిపారు మోదీ. గాల్వాన్ లోయలో మరణించిన బిహార్ ముద్దుబిడ్డలు.. భారత మాత సగర్వంగా తలెత్తుకునేలా చేశారని పేర్కొన్నారు. పుల్వామా దాడిలోనూ బిహార్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, వారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తానని తెలిపారు.
ఇదీ చూడండి: ఆగని ఆకలి కేకలు.. భారతావనికేదీ పౌష్టికాహారం?