పాలనా యంత్రాంగం, ప్రభుత్వానికి మధ్య సాంకేతిక పరిజ్ఞానం వారధిలా పని చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్, ఆ సంస్థ ఆర్థిక సలహాదారు రూపా పురుషోత్తమన్.. సాంకేతికత అవసరంపై రచించిన 'బ్రిడ్జిటల్ నేషన్' పుస్తకాన్ని మోదీ ఆదివారం దిల్లీలో ఆవిష్కరించారు. సాంకేతికతపై భయాలు, ఆందోళనలు వ్యాప్తి చెందుతున్న తరుణంలో.. ఈ పుస్తకం రాయడం సంతోషకరమని ప్రధాని పేర్కొన్నారు. సాంకేతికత ఏ మాత్రం ప్రమాదకారి కాదన్న మోదీ.. వివిధ అంశాల మధ్య ఇది అనుసంధానతను పెంచుతుందని వివరించారు.
" సాంకేతికత అనుసంధానకర్తగా పనిచేస్తుంది. ఇది విడగొట్టే సాధనం కాదు. వంతెన వంటిదేగాని.... విభాగిని కాదు. సాంకేతికత అనేది పరిజ్ఞానాన్ని పెంచే బహువిధ సాధనం. ఎంతమాత్రం ప్రమాదకారి కాదు. ఆశలు, సాధించిన ఘనతకు మధ్య వారధిని ఏర్పాటు చేస్తుంది. డిమాండుకు, అది సాధించడానికి మధ్య బలమైన వంతెనలా నిలబడుతుంది. ప్రభుత్వానికి, పాలనకు మధ్య కూడా సాంకేతికత అనుసంధానకర్తగా ఉంటుంది. సబ్‌కా సాథ్ సబ్ కా వికాస్ అన్న కలను నెరవేర్చేందుకు సాంకేతికత చక్కని మార్గం. గత అయిదేళ్ల మా పాలనలో ఇదే విధానం అనుసరిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే మా విధానం."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి