అంపన్ తుపాను ధాటికి అతలాకుతలమైన బంగాల్ను ఆదుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తక్షణ సాయం కింద రూ.1000 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.
"నేను రూ.1000 కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించాను. వ్యవసాయం, విద్యుత్, ఇతర రంగాలకు జరిగిన నష్టాలపై, కూలిన ఇళ్ల విషయంలో పూర్తిస్థాయి సర్వే నిర్వహిస్తాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశం మొత్తం బంగాల్ ప్రజలకు తోడుగా ఉన్నారు."
- ప్రధాని మోదీ
ఇవాళ ఉదయం బంగాల్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ... ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్రమంత్రులతో కలిసి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విహంగ వీక్షణం చేశారు. తరువాత బంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్, మమతా బెనర్జీలతో క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. తుపాను ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న బంగాల్లో పునరావాస, ఉపశమన చర్యల కోసం తక్షణసాయంగా రూ.1000 కోట్లు ప్రకటించారు.
భారీ నష్టం..
అంపన్ తుపాను ధాటికి బంగాల్లో 80 మంది మరణించారు. భారీ ఊదురుగాలులతో కూడిన వర్షాల వల్ల చెట్లు, ఇళ్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీనితో భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ముఖ్యంగా కోల్కతా, మిడ్నాపుర్, హౌవ్డా, హూగ్లీ, ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి.
ఇదీ చూడండి: 'ఐలా తుపాను కంటే అంపన్ బీభత్సమే ఎక్కువ'