2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సమాయత్తం అవుతున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థికవేత్తలు, నిపుణులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేబినెట్ మంత్రులు, నీతిఅయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్, సీఈవో అమితాబ్ కాంత్, ఇతర సీనియర్ అధికారులు.. హాజరయ్యారు.
బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేసే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో...ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 11ఏళ్ల తర్వాత ఐదుశాతానికి దిగజారిన వృద్ధిరేటును పట్టాలెక్కించడానికి తీసుకోవాల్సిన చర్యలు సహా ఆర్థికవ్యవస్థ స్థితిగతులపై సమావేశంలో చర్చించారు. అంతేకాకుండా నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల కృషి చేయాలని పిలుపునిచ్చారు మోదీ.
రుణవిస్తరణ, ఎగుమతుల వృద్ధి, ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిపాలన,వినియోగంలో పెరుగుదల,ఉద్యోగ కల్పనకు ఆర్థిక నిపుణులు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.నిపుణుల సూచనలకు సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ... ఏవి స్వల్ప కాలంలో, ఏవి దీర్ఘకాలంలో చేపట్టవచ్చో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. ఆర్థిక వృద్ధి రేటు,అంకురాలు,నూతన ఆవిష్కరణలపై ప్రధాని నరేంద్ర మోదీ..ఆర్థిక నిపుణులతో విస్తృత చర్చలు జరిపినట్లు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ ట్వీట్ చేశారు.
సలహాలు, సూచనలు...
బడ్జెట్‌పై అధికారులు కసరత్తు చేస్తున్న వేళ ప్రధాని మోదీ.. ప్రజల నుంచి సలహలు, సూచనలను కోరారు.
"పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్సో 2020 కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టాడానకి ఆర్థిక శాఖ మీ సలహాలు, సూచనలను పరిణిగణనలోకి తీసుకుంటుంది. రైతులు, విద్యావేత్తలు, ఇతర నిపుణులు మీ ఆలోచనలు, సూచనలను పంపిచండి."
-నరేంద్ర మోదీ ట్విట్.