ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. భారత వైమానిక దళానికి చెందిన రూ. 30 వేల కోట్లను దొంగిలించారని ఆరోపించారు.
జార్ఖండ్ రాంచీలోని మోరబడి మైదానంలో జరిగిన పార్టీ 'పరివర్తన్ ఉల్గులన్ మహా ర్యాలీ' కార్యక్రమంలో భాగంగా ప్రసంగించారు. రఫేల్ ఒప్పందంలోని అవినీతి సొమ్మును అనిల్ అంబానీకి ఇచ్చారని ఆరోపించారు.
"వాయుసేనమన దేశాన్ని రక్షిస్తుంది. వాయుసేనకు చెందిన రూ.30వేల కోట్లను ప్రధానమంత్రి దొంగిలించి అనిల్ అంబానీకి ఇచ్చారు. " - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
పారిశ్రామికవేత్తలకు చెందిన రూ. 3.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన ప్రధాని రైతులు, విద్యార్థులు, చిరు వ్యాపారులకు ఏమీ చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు కనీస ఆదాయ పథకం అమలు చేస్తామని పునరుద్ఘాటించారు.