దేశ భద్రతకు సంబంధించి కీలక ప్రకటన చేశారు ప్రధాని నరేంద్రమోదీ. త్రివిధ దళాల మధ్య మరింత మెరుగైన సమన్వయం, సమర్థమైన నాయకత్వం కోసం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పేరిట ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో ఈ విషయాన్ని మోదీ వెల్లడించారు.
"త్రివిధ దళాలకు ఒకే అధిపతి ఉండాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేసేందుకు ఈ చర్య ఎంతో దోహదం చేస్తుంది."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
విస్తృత సంప్రదింపుల తర్వాత...
పలు కమిటీల ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
- ఈ ఆలోచనను 1999 కార్గిల్ యుద్ధం తర్వాత రక్షణ శాఖకు ఉన్నత స్థాయి కమిటీ నివేదించింది. మూడు దళాల మధ్య అంతరం తొలగించేందుకు ఒకే అధిపతి ఉండాల్సిన అవసరం ఉందని తెలిపింది.
- జాతీయ భద్రత విషయంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు చేసిన మంత్రుల బృందమూ ఇదే అంశాన్ని కీలకంగా ప్రస్తావించింది.
- త్రివిధ దళాలకు ఉమ్మడి శాశ్వత ఛైర్మన్ ఉండాల్సిన అవసరం ఉందని నరేశ్ చంద్ర టాస్క్ ఫోర్స్ 2012లో సూచించింది. ఇందులో సైన్యం, నావికా దళం, వైమానిక దళ అధిపతుల్లో సీనియర్ వ్యక్తిని ఛైర్మన్గా నియమించాలని సిఫార్సు చేసింది.
ఇదీ చూడండి: 'జల్ జీవన్'తో ఇంటింటికీ తాగునీరు: మోదీ