నూతన వ్యవసాయ చట్టాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న కేసుల్లో తమను కక్షిదారుగా చేర్చాలంటూ భారతీయ రైతు సంఘాల కన్సార్టియం(సీఐఎఫ్ఏ) సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ సంస్కరణలు రైతులకు ప్రయోజనకరమని పేర్కొంది. వ్యవసాయ రంగం వృద్ధికి, ఆదాయం పెరగడానికి ఇవి దోహదం చేస్తాయని తెలిపింది. ఈ విషయంపై అభిప్రాయం తెలిపేందుకు ఇతర రైతు సంఘాలకు అవకాశం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరింది. చట్టాల్లో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే దేశంలోని ఇతర రైతు సంఘాలను సంప్రదించేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో అభ్యర్థించింది.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలపై జనవరి 11న భారత ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. దీంతోపాటు దిల్లీ సరిహద్దులో ఆందోళనలకు సంబంధించిన పిటిషన్లనూ విచారించనుంది. వీటిపై అభిప్రాయాన్ని వెల్లడించాలని కేంద్రానికి ఇదివరకే నోటీసులు జారీ చేసింది.
గతేడాది డిసెంబర్ 17న రైతుల నిరసనల విషయంలో జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆందోళనలు కొనసాగించేందుకు అనుమతించింది. నిరసనలు తెలపడం ప్రాథమిక హక్కు అని పేర్కొంది. అయితే ఇతరుల స్వేచ్ఛకు అది భంగం కలిగించకూడదని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: రైతులతో నేడు 8వ విడత చర్చలు- కొలిక్కివచ్చేనా?