అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేసులో రోజువారీ విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీం కోర్టులో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త కేఎన్ గోవింద్ఆచార్య వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్పై అత్యవసరంగా విచారణ కోరారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారిస్తామని కోర్టు తెలిపింది.
పిటిషన్ను పరిశీలించిన సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బాబ్దే, జస్టిస్ బీఆర్ గవాయితో కూడిన ధర్మాసనం... అత్యవసర విచారణకు నిరాకరించింది. ఇది న్యాయస్థానం పాలనాపరంగా తీసుకునే నిర్ణయమని తెలిపింది. ఈ విషయమై చర్చ అవసరమని అభిప్రాయపడింది. వీడియో రికార్డు చేసేందుకు తమ వద్ద పరికరాలు ఉన్నాయో లేదో తెలియదని పేర్కొంది.
ప్రత్యక్ష ప్రసారానికి ఇబ్బందులు ఉంటే కనీసంగా విచారణను వీడియో రికార్డు చేయాలని ఆచార్య తరఫు న్యాయవాది వికాస్ సింగ్ కోరారు. ముఖ్యమైన కేసుల్లో ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చని గతేడాది సుప్రీం ఇచ్చిన తీర్పును సింగ్ ప్రస్తావించారు.
అయోధ్య కేసులో మధ్యవర్తిత్వ కమిటీ జులై 31న సమర్పించిన నివేదికపై ఆగస్టు 2న సుప్రీం విచారణ చేపట్టింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాద పరిష్కారంలో మధ్యవర్తిత్వ కమిటీ ఎలాంటి ఫలితం ఇవ్వలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ కేసులో మంగళవారం నుంచి రోజువారీ విచారణ కొనసాగిస్తామని తెలిపింది.
ఇదీ చూడండి: ఆగస్టు 6 నుంచి అయోధ్యపై రోజువారీ విచారణ