దేశంలో కరోనా పరీక్షల సామర్థ్యాన్ని వచ్చే రెండు నెలల్లో రెట్టింపు చేయనున్నట్లు వెల్లడించారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సగటున రోజుకు 5లక్షల పరీక్షలు నిర్వహిస్తున్నామని, త్వరలో ఈ సంఖ్యను 10లక్షలకు పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.
కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు హర్షవర్దన్. కరోనాపై పోరాటంలో వైద్య సిబ్బందితో కలిసి పోరాడుతోందని శాస్త్రీయ రంగాన్ని ప్రశంసించారు.
" దేశంలో మొదటి కరోనా కేసు జనవరి 30న నమోదైంది. 6నెలలుగా వైరస్‌పై నిర్విరామంగా పోరాడుతున్నాం. భారత్‌లో రికవరీ రేటు 64శాతంగా ఉంది. ఇది ప్రపంచంలోనే ఉత్తమం. మరణాల రేటు 2.2శాతంగా ఉంది. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను శరవేగంగా మెరుగుపరుస్తున్నాం. 6 నెలల క్రితం విదేశాల నుంచి వెంటిలేటర్లు దిగుమతి చేసుకునే వాళ్లం. ఇప్పుడు స్వదేశంలోనే 3లక్షల వెంటిలేటర్లు తయారు చేసే స్థాయికి చేరాం. ఏప్రిల్‌లో రోజుకు 6,000 పరీక్షలు మాత్రమే నిర్వహించేవాళ్లం. ఇప్పుడు దాదాపు 5లక్షల పరీక్షలు నిర్వహిస్తున్నాం. "
-హర్షవర్దన్, కేంద్ర ఆరోగ్యమంత్రి.
భారత్ బయోటెక్, జైడస్ కెడిలా సంస్థలు మానవులపై నిర్వహిస్తున్న వ్యాక్సిన్ ప్రయోగాలపై స్పందిస్తూ... ఆ దశకు చేరుకున్న అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటన్నారు కేంద్ర మంత్రి.