చైనా సైన్యం దూకుడు తగ్గించుకోవడంలేదు. సైనిక, దౌత్యపరమైన చర్చల్లో చేసుకున్న ఒప్పందాలను బేఖాతరు చేస్తూ మరిన్ని బలగాలను సరిహద్దుకు తరలిస్తోంది. లద్దాఖ్ సెక్టార్లోని వాస్తవాధీన రేఖ వెంబడి 20 వేలకు పైగా సైన్యాన్ని మోహరించింది. హై మొబిలిటీ వాహనాలు, ఆయుధాలతో మరో 10-12 వేల మంది సైనికులను షింజియాంగ్లో సిద్ధంగా ఉంచింది. అవసరమైతే 48 గంటల్లోనే సరిహద్దుకు చేరుకునే విధంగా మోహరింపులు చేపట్టింది.
ఇదీ చదవండి: 'గల్వాన్ను ఆక్రమించుకోవాలన్నదే చైనా ప్లాన్'
అయితే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కదలికలను భారత్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
"రెండు డివిజన్ల(దాదాపు 20 వేల) సైన్యాన్ని ఎల్ఏసీ చైనా వద్ద మోహరించింది. మరో డివిజన్(10 వేల) సైన్యాన్ని దక్షిణ షింజియాంగ్లో వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంచింది. అయితే చైనా వైపు భూభాగం చదునుగా ఉండటం వల్ల వీరు గరిష్ఠంగా 48 గంటల్లోనే భారత సరిహద్దుకు చేరుకోగలరు. ఈ సైన్యం కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నాం."
-అధికార వర్గాలు
ఇరు దేశాధికారుల మధ్య ఆరు వారాలుగా దౌత్య, సైనికపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ.. సరిహద్దులో సైనికుల సంఖ్యను చైనా ఏ మాత్రం తగ్గించడం లేదని అధికారులు తెలిపారు. సాధారణంగా టిబెట్లో రెండు డివిజన్ల సైన్యం మాత్రమే ఉంటుందని... ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల మధ్య మరో రెండు డివిజన్ల సైన్యాన్ని రెండు వేల కిలోమీటర్ల దూరం నుంచి చైనా తీసుకొస్తోందని పేర్కొన్నారు.
మనోళ్లూ సిద్ధమే!
అయితే భారత సైన్యం కూడా అత్యంత అప్రమత్తంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. సమీపంలోని రెండు డివిజన్ల సైన్యాన్ని లద్దాఖ్కు చేర్చినట్లు తెలిపారు. ఇందులో కొండప్రాంతాల్లో ప్రావీణ్యం ఉన్న రిజర్వ్ మౌంటెయిన్ డివిజన్ కూడా ఉన్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: భారత సైన్యం దీటుగా జవాబిచ్చింది: మోదీ
ట్యాంకులు, బీఎంపీ-2 పదాతిదళ పోరాట వాహనాలను ఎయిర్ఫోర్స్ విమానాల ద్వారా సరిహద్దుకు తరలించినట్లు స్పష్టం చేశారు అధికారులు. డీబీఓ సెక్టార్ వద్ద ఇప్పటికే సాయుధ వాహనాలను మోహరించినట్లు తెలిపారు. డీబీఓ సెక్టార్ నుంచి గల్వాన్ లోయ వరకు చైనా ప్రదర్శిస్తున్న దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు.. ఈ సెక్టార్లో మరో డివిజన్ సైన్యాన్ని మోహరించనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: 'ఒకే సరిహద్దు- ఒకే సైన్యం విధానం మనకూ అవసరం'
పాంగొంగ్ సరస్సు, ఫింగర్ ప్రాంతాల్లో చైనా సైన్యం అత్యంత పటిష్ఠ స్థితిలో ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఫింగర్-8 వద్ద భారీ వాహనాలు, పడవలు మోహరించడమే కాక పరిపాలన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడించాయి.
"సరస్సు పక్కన ఫింగర్ 8 నుంచి ఫింగర్ 5 వరకు చైనా నిర్మించిన రోడ్డు వల్ల సైనికులను ఫింగర్ 4 స్థావరానికి తక్కువ సమయంలో తరలించవచ్చు. భారత్తో పోలిస్తే సైన్యం తరలించేందుకు చైనా తీసుకునే సమయం చాలా తక్కువ. అంతేకాకుండా.. సరస్సు సమీపంలో అవసరమైన సైనిక మౌలిక సదుపాయాలను నిర్మించుకుంటున్నారు."
-అధికారులు
మే 18-19 తేదీల్లో చైనా పెద్ద సంఖ్యలో తన సైన్యం పాంగొంగ్ సో సరస్సు వద్దకు తరలించిందని... దాదాపు 200 మంది భారత సైనికులు గస్తీ కాసే ఆ ప్రాంతంలోకి 2,500 మంది సైనికులను పంపిందని అధికారులు తెలిపారు. భారత సైన్యాన్ని ఫింగర్ 3ను దాటి ముందుకెళ్లకుండా అడ్డుకున్నారని చెబుతున్నారు.
మరికొంత కాలం ఇంతే
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే సరిహద్దులో సంక్షోభం సెప్టెంబర్-అక్టోబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మంచు అధికంగా కురిసే వరకు సైనిక మోహరింపులు ఉంటాయని చెప్పారు. శీతాకాలంలో గల్వాన్ లోయలో నీరు గడ్డకడుతుంది కాబట్టి పరిస్థితులు మరింత అనుకూలంగా మారతాయని, వేసవి కాలంలో బలగాలను మోహరించడం చైనాకు కష్టమవుతుందని పేర్కొన్నారు. అయితే.. భారత సైన్యం కూడా ఈ సుదీర్ఘ ప్రతిష్టంభన ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు.
మే నెలలో ప్రారంభం
మే 4, 5 తేదీల్లో చైనా సైన్యం గల్వాన్ నది లోయలోని 14వ గస్తీ పాయింట్ వద్దకు చొచ్చుకొని రావడం వల్ల ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన మొదలైంది. ఆ ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం తమదేనని చైనా సైన్యం ప్రకటించింది. భారత బలగాలను ష్యోక్ నదికి పశ్చిమ దిక్కుకు వెళ్లాలని డిమాండ్ చేసింది. జూన్ 15/16 తేదీల్లో ఇరుదేశ సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణ.. ఉద్రిక్తతలను తీవ్ర స్థాయికి తీసుకెళ్లింది.
ఇవీ చదవండి