ఆంజనేయుడు అడవితల్లి ఒడిలో, పచ్చని ప్రకృతిలో ఒదిగి ఆటలాడుకున్నాడని ఇతిహాసాలు చెబుతాయి. అలాంటి ప్రకృతి ప్రేమికుడి కోసం కర్ణాటకలో ఓ రాళ్లూ రప్పలు నిండిన కొండనే హరితవనంగా మార్చేశాడు ఓ భక్తుడు.
కల తెచ్చిన కళ..
కర్ణాటక చిక్క్బళ్లాపుర్కు చెందిన నారాయణ స్వామికి కొద్ది రోజుల కింద ఓ కల వచ్చింది. ఆ కలలో ఆంజనేయ స్వామి వచ్చి ఈ కొండను చూపించి 'ఇదే నేనుండే చోటు' అన్నాడు. అక్కడ తానుండేందుకు ఓ మందిరాన్ని నిర్మించమన్నాడు. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లి అంతా శుభ్రం చేసి, తనకున్న రెండెకరాల పొలం అమ్మేసి చిన్న గుడి కట్టేశాడు నారాయణ. దారి లేని ఆ కొండకు భక్తులు వచ్చేలా ఓ రోడ్డు మార్గాన్ని నిర్మించాడు. నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టాడు.
రాళ్లు, రప్పలతో నిండిన ఆ పర్వతంపై తనకిష్టమైన హనుమంతుడు కొలువుదీరాడని ఆనందం వ్యక్తం చేశాడు. అందుకే, ఆ ప్రదేశాన్ని హరితమయం చేసేందుకు మొక్కలు నాటడం మొదలుపెట్టాడు. రోజూ బిందెల్లో నీళ్లు మోసుకొచ్చి ప్రేమగా మొక్కలకు పోశాడు. ఇప్పటివరకు దాదాపు 7 వేల మొక్కలు నాటిన నారాయణ సంకల్పాన్ని చూసి అటవీ శాఖ అధికారులు.. కొన్ని మొక్కలు ఉచితంగా ఇచ్చారు.
ఇప్పుడు ఆ కొండ పనస, కొబ్బరి, మర్రి లాంటి మహావృక్షాల మొక్కలతో కళకళలాడుతోంది. దేవుడిపై భక్తితో ఏడు వేలకు పైగా మొక్కలు నాటిన నారాయణను.. అటు ఆంజనేయ భక్తులు , ఇటు ప్రకృతి ప్రేమికులు కొనియాడుతున్నారు.
ఇదీ చదవండి:పర్యావరణంపై ఉపాధ్యాయుడి ప్రేమ.. వ్యర్థాలతో అద్భుతాలు