రాజస్థాన్‌లో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్‌పై కాంగ్రెస్ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ప్రకటించారు. అలాగే పార్టీ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి కూడా ఆయనను తప్పించారు. మరో ఇద్దరు మంత్రులను కూడా పదవుల నుంచి తొలగించింది కాంగ్రెస్.
వరుసగా రెండో రోజు సమావేశమైన సీఎల్పీ.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సచిన్‌కు ఉద్వాసన పలికే తీర్మానానికి సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. సీఎల్పీ సమావేశానికి హాజరయ్యేందుకు రెండుసార్లు అవకాశం ఇచ్చినా పైలట్ నుంచి స్పందన రాకపోవడం వల్ల చివరకు ఆయనను తొలగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఆయనతో ఉన్న ఇతర తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పార్టీ నిర్ణయించింది.
రాహుల్, ప్రియాంక ప్రయత్నించినా..
అంతకుముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అహ్మద్ పటేల్ వంటి అగ్రనేతలు మాట్లాడినప్పటికీ.. నేటి సీఎల్పీ భేటీకి సచిన్ డుమ్మా కొట్టారు. ఆయన వర్గ ఎమ్మెల్యేలు సైతం పార్టీ ఆహ్వానాన్ని బేఖాతరు చేశారు. మరోవైపు గహ్లోత్ వర్గంలోని ఎమ్మెల్యేలు కూడా నెమ్మదిగా జారుకుంటున్నట్లు జైపుర్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
సోమవారం సీఎల్పీ భేటీకి హాజరైనవారిలో 20 మంది నేడు ఉదయం కనిపించకుండా పోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే నేడు ఉదయం 10 గంటలకు జరగాల్సిన సమావేశం ఆలస్యంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. వారంతా పైలట్ వర్గంలో చేరినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాజస్థాన్ రాజకీయాల్లో ఏం జరుగుతోందనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
పైలట్‌కు భాజపా స్వాగతం..!
సచిన్ పైలట్‌ను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ తీర్మానించిన వెంటనే భారతీయ జనతా పార్టీ స్పందించింది. ఈ సమయంలో పైలట్‌ను భాజపాలోకి ఆహ్వానిస్తున్నట్లు ఆ పార్టీ నేత ఓం ప్రకాశ్ మాథుర్ ప్రకటించారు. భాజపా విధానాలు నచ్చినవారు ఎవరైనా పార్టీలోకి రావొచ్చని ఆయన స్పష్టంచేశారు.
అయితే ముఖ్యమంత్రి గహ్లోత్ తనకు సంపూర్ణ మెజారిటీ ఉందని ప్రకటించిన నేపథ్యంలో అసెంబ్లీలో బలనిరూపణ ద్వారా ఆ విషయం నిరూపించుకోవాలని మాథుర్ సూచించారు. రాజస్థాన్ ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభం సమయంలో భాజపా బహిరంగంగా స్పందించడం ఇదే తొలిసారి.
ఇదీ చూడండి: 'వారాంతానికి 10లక్షలకుపైగా కరోనా కేసులు'