కరోనా వైరస్ హెచ్చరికలు, ఆర్థిక సేవల పేరిట సైబర్ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడే అవకాశం ఉందని 'ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్'(సీఈఆర్‌టీ-ఇన్) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కరోనాకు సంబంధించిన ప్రభుత్వ సహాయ కార్యక్రమాల పేరుతో హానికరమైన ఈ-మెయిల్స్‌తో ప్రజల్ని మభ్యపెట్టే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈ సైబర్ దాడి ఆదివారం నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. సైబర్ నేరగాళ్ల దగ్గర దాదాపు రెండు మిలియన్ల భారత పౌరుల ఈ-మెయిల్ ఐడీలు ఉన్నట్లు గుర్తించామంది. అనుమానాస్పదమైన సందేశాలకు స్పందించొద్దని.. అందులో పంపే లింకులపై ఎట్టిపరిస్థితుల్లో క్లిక్ చేయొద్దని హెచ్చరించింది.
మోసగాళ్లు కొవిడ్-19 పరీక్షల పేరిట దిల్లీ, ముంబయి, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ సహా పలు ఇతర ప్రముఖ నగరాల్లోని ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరించి మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సీఈఆర్‌టీ-ఇన్ తెలిపింది.
ప్రభుత్వ అధికారులు, ఇతర అధికారిక సంస్థల ఈ-మెయిల్ ఐడీలను పోలిన లేదా నకిలీ ఐడీలతో నేరాలకు పాల్పడొచ్చని హెచ్చరించింది. 'ncov2019@gov.in' వంటి ఈ-మెయిళ్ల ద్వారా ప్రజల్ని మోసం చేయోచ్చని తెలిపింది. ఎలాంటి అనుమానం ఉన్నా లేదా సైబర్ మోసానికి గురైనా వెంటనే incident@cert-in.org.inకు సమాచారం అందజేయాలని కోరింది.
ఇవీ చూడండి: