పర్యావరణ హితానికై ప్లాస్టిక్ భూతాన్ని గ్రామం నుంచి తరిమికొట్టాలని తీర్మానించుకున్నారు కేరళ కొల్లం జిల్లా పెరినాడ్ గ్రామానికి చెందిన 40 మంది మహిళలు. తమ గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని 'హరిత కర్మ సేన'ను ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రతి నివాసానికి వెళ్లి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తున్నారు.
" ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు ప్రజల ఇళ్లకు వెళ్లినప్పడు వాళ్లే శుభ్రం చేసి ఇస్తారు. హరిత కర్మ సేన వాటిని సేకరించి ఓ కార్డును ఇస్తుంది. స్థానికుల సహకారం చాలా బాగుంది. "
-శిర్లే, హరిత కర్మ సేన సభ్యురాలు
ప్లాస్టిక్ పౌడర్‌తో రోడ్లు..
ఇళ్ల నుంచి సేకరించిన ప్లాస్టిక్‌ను ప్రాసెసింగ్ యూనిట్‌కు తరలిస్తోంది హరిత కర్మ సేన. ఆ తర్వాత దానిని శుభ్రపరిచి ముక్కలుగా చేసి పొడిని తయారు చేస్తున్నారు. ఈ పొడిని క్లీన్ కేరళ కంపెనీకి సరఫరా చేస్తున్నారు. తారు రోడ్ల కోసం ఈ ప్లాస్టిక్ పొడిని ఉపయోగిస్తుంది ఆ సంస్థ.
ఈ ప్రాసెసింగ్ యూనిట్‌ను శిర్లే సహా ముగ్గురు మహిళలు నిర్వహిస్తారు. పొరుగు గ్రామ పంచాయతీలు, కేరళలోని ఇతర గ్రామాలు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు తమ సాయం కోరుతున్నారని వారు చెప్పారు.
దేశానికే ఆదర్శం
వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నిర్మూలనలో పెరినాడ్ను దేశమంతా ఆదర్శంగా తీసుకోవాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ ప్రకటించింది. పర్యావరణ పరిరక్షణ చర్యల అమలులో ఈ గ్రామాన్ని ఓ ఉదాహరణగా ఎంపిక చేసింది. ప్లాస్టిక్ రాకాసిపై పోరాటం ఎలా చేయాలో పెరినాడ్ను చూసి నేర్చుకోవాలని కొనియాడింది.
ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు హరిత కర్మ సేన ఆలోచన అందరినీ మెప్పించింది. డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వ్యర్థాల నిర్వహణకు ఎలక్ట్రానిక్ విధానాన్ని తీసుకువచ్చే ఆలోచనలో వీరు ఉన్నారు.