గుజరాత్లో బంగాళదుంప సాగు చేసిన రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆహార, శీతల పానీయాల దిగ్గజ సంస్థ పెప్సికో ఇండియా తెలిపింది. అయితే ఈ నిర్ణయాన్ని పెప్సికో ఇంకా న్యాయస్థానాలకు తెలియజేయలేదని రైతుల తరఫు న్యాయవాది ఆనంద్ యాగ్నిక్ తెలిపారు.
'లేస్ చిప్స్' కోసం 'ఎఫ్-సీ' రకం బంగాళదుంపపై పెప్సికో సంస్థ 'మేథో హక్కులు' (ప్లాంట్ ప్రొటక్షన్ రైట్స్) పొందింది. అయితే గుజరాత్‌కు చెందిన కొంతమంది రైతులు ఇదే రకం బంగాళదుంపను సాగుచేశారు. తమ అనుమతి లేకుండా పండించారని, ఇది మేథో హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని కారణం చూపి 11మంది రైతులపై పెప్సికో కేసు పెట్టింది. కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని డిమాండ్ చేసింది.
రైతులపై పెప్సికో పెట్టిన కేసులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన పెప్సికో, ప్రభుత్వంతో చర్చించిన తరువాత కేసులు ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది.
ఇది రైతుల విజయం..
గుజరాత్ రైతులపై కేసులు వెనక్కి తీసుకోవాలన్న పెప్సికో నిర్ణయాన్ని 'భారతీయ కిసాన్ సంఘ్' స్వాగతించింది. ఇది రైతుల ఘన విజయంగా అభివర్ణించింది.
ఇదీ చూడండి: మసూద్ అంశంపై ఆగని మాటల మంటలు