విపత్తు నిర్వహణ చట్టం కింద కరోనాను ఎదుర్కొనేందుకు ఓ జాతీయ ప్రణాళిక సిద్ధం చేయాలని కేంద్రాన్ని కోరింది కాంగ్రెస్. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా జరిగిన మీడియా సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ మాట్లాడారు. లాక్డౌన్ విధానాల అమలుపై కేంద్రం పునరాలోచించుకోవాలన్నారు.
'మీరు ప్రజలను బంధించి.. ఆర్ధిక వ్యవస్థకు కళ్లెం వేయొద్దు. ఇది సరైన పద్ధతి కాదు. ఇది విమర్శించే సమయం కాదు .. మేము కేవలం ఓ సారి పునరాలోచించాలి అంటున్నాం. వీలైనంతవరకు మేము ప్రభుత్వానికి సహకరిస్తాం. ప్రధాని నిమిత్తంగా వ్యవహరిస్తున్నారు. ఆయన సమయానికి వచ్చి దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు కానీ.. లాక్డౌన్ ప్రకటించి 7 వారాలైనా వివరమైన ప్రణాళికలు సిద్ధం చేయలేదు."
-కపిల్ సిబల్, కాంగ్రెస్ సీనియర్ నేత
క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలియని ప్రభుత్వ అధికారులు కార్యాలయాల్లో కూర్చొని తాత్కాలిక పరిష్కారాలు ప్రతిపాదిస్తున్నారని ఆరోపించారు సిబల్. ఈ సంక్షోభ సమయంలో న్యాయ వ్యవస్థ కలుగజేసుకుని.. ఓ పరిష్కార విధానాన్ని రూపొందించాలని సిబల్ అభిప్రాయపడ్డారు.
రాష్ట్రాలపై భారమా?
సరైన సదుపాయాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనే పరిస్థితి లేదన్నారు సిబల్. ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.
⦁ తక్షణమే ఓ జాతీయ ప్రణాళికను రూపొందించాలి.
⦁ ఈ చట్టం ప్రకారం జాతీయ కార్యనిర్వాహక కమిటీ (ఎన్‌ఇసి)కి హోంమంత్రిత్వ శాఖ అధ్యక్షత వహించాలి.
⦁ పరిస్థితులను సాధ్యమైనంత ఉత్తమంగా పరిష్కరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలివ్వాలి.
సరైనా పారిశుద్ధ్యం, వైద్య, ఆహారం, నీటి వసతులు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వాలపైనే భారం వేసేద్దామని కేంద్ర చూస్తోందన్నారు సిబల్. లాక్డౌన్ కారణంగా నష్టపోయిన చిరు వ్యాపారులు, పేదలు, వలస కార్మికుల కోసం చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు..
ఇదీ చదవండి:50 ఏళ్ల టీచరమ్మ.. బౌలింగ్ అదిరిందమ్మా!