శీతాకాలం ప్రారంభంలోనే దేశరాజధాని దిల్లీలో వాయుకాలుష్యం పెరిగిపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. వాయు కాలుష్యం కారణంగా ప్రజల ఆయువు క్షీణిస్తోందని వెల్లడించింది. కాలుష్యాన్ని నియంత్రించటంలో అధికారులు విఫలమయ్యారంటూ వ్యాఖ్యానించింది.
జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం దిల్లీ వాయు కాలుష్యంపై విచారణ చేపట్టింది. ఐఐటీకి చెందినవారు సహా వాతావరణ నిపుణులను అరగంటలోగా హాజరయ్యేలా చూడాలని కేంద్రాన్ని ఆదేశించింది.
'జీవనం సాధ్యమేనా'
ఈ వాతావరణంలో ప్రజలు జీవనం సాగించగలరా?.. అంటూ ప్రశ్నించింది కోర్టు. మనం ఇలాంటి వాతావరణంలో బతకలేమని పేర్కొంది. అధికారులు వాయుకాలుష్యానికి ప్రజలను బలిచేస్తున్నారని వ్యాఖ్యానించింది. వాయుకాలుష్యానికి రాష్ట్రాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టీకరించింది.
"వాయు కాలుష్యంతో దేశ రాజధాని దిల్లీ ఏటా ఉక్కిరిబిక్కిరవుతుంది. కానీ మనం దీని నియంత్రణకు ఏమీ చేయలేకపోతున్నాం. భారత్ లాంటి నాగరిక దేశంలో ఇలాంటి వాతావరణం ఉండటం విషాదకరం. వ్యవసాయ వ్యర్థాలను ఏటా తగలబెట్టడం ఎందుకు?.. ప్రతిసారీ ఇదే విధంగా గగ్గోలు పెడుతూనే ఉన్నాం. రాష్ట్రాలకు ఈ విషయం తెలుసు కానీ ఏమీ చేయడం లేదు."
-విచారణ సందర్భంగా సుప్రీం.
వ్యవసాయ వ్యర్థాల కాల్చివేత పంజాబ్లో 7 శాతం పెరిగిందని.. హరియాణాలో మాత్రం 17 శాతం తగ్గిందని కేంద్రం అఫిడవిట్ సమర్పించిందని సీనియర్ న్యాయవాది అపరాజిత్ సింగ్ న్యాయస్థానానికి తెలిపారు. దిల్లీ వాయుకాలుష్యం కేసులో ఆయన కోర్టుకు అమికస్ క్యూరీగా సహాయపడుతున్నారు.
దిల్లీ ప్రభుత్వ వివరణ..
వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు అనుసరిస్తున్న 'బేసి- సరి' విధానం ద్వారా వాయుకాలుష్యం తగ్గిందని రుజువు చేసే రికార్డులను, సమాచారాన్ని శుక్రవారంలోగా కోర్టుకు నివేదించాలని ఆదేశించింది. సరి-బేసి విధానం...... కార్లకే వర్తింపజేస్తే ప్రయోజనం లేదన్న సుప్రీంకోర్టు ద్వి, త్రిచక్ర వాహనాలతోనూ కాలుష్యం పెరుగుతోందని అభిప్రాయపడింది.
తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ దేశరాజధాని ప్రాంతంలో భవనాల నిర్మాణం, కూల్చివేతలపై ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది సుప్రీం. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై రూ. లక్ష వరకు జరిమానా విధిస్తామని తెలిపింది. వ్యర్థాలను కాల్చేవారిపై రూ. 5వేల జరిమానా విధిస్తామన్న కోర్టు బహిరంగ ప్రదేశాలలో చెత్త పడేయకుండా మున్సిపాలీటీలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
తదుపరి విచారణను ఈ నెల ఆరోతేదికి వాయిదా వేసింది.
ఇదీ చూడండి:ఇకపై 2 రోజుల్లోనే మొబైల్ నంబర్ పోర్టబిలిటీ పూర్తి!