భాజపా తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నించినప్పటికీ తమ ఎమ్మెల్యేలంతా కలిసే ఉన్నారని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్నారు. ఒక్క ఎమ్మెల్యే కూడా విడిచి వెళ్లలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో సోదరభావం ఇలాగే కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ సమస్యలు పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆదాయపు పన్ను శాఖ, సీబీఐను దుర్వినియోగం చేస్తున్నారని కేంద్రంపై ఆరోపణలు చేశారు గహ్లోత్. మతం పేరిట రాజకీయాలు చేస్తున్నారని భాజపాపై మండిపడ్డారు.
అయితే, రాజస్థాన్‌లో తమ ప్రభుత్వానికి ఢోకా లేదని, ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటుందని గహ్లోత్ విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమాగా చెప్పారు.
అంతకుముందు.. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఓం ప్రకాశ్ హుల్దా, సురేశ్ టాంక్, ఖుశ్వీర్ సింగ్ కలిసి సీఎం గహ్లోత్‌ను జైపుర్‌లోని ఆయన నివాసంలో కలిశారు.
సమావేశం వాయిదా
మరోవైపు భాజపా శాసనపక్ష సమావేశాన్ని ఆగస్టు 13కి వాయిదా వేశారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం జరగాల్సి ఉండగా.. దీన్ని గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు రాజస్థాన్ అసెంబ్లీలో విపక్ష నేత గులాబ్ చంద్ కటారియా వెల్లడించారు. పార్టీ ఎమ్మెల్యేలందరూ జైపుర్‌లోని భాజపా కార్యాలయానికి హాజరు కావాలన్నారు.
ఇదీ చదవండి: దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం: ప్రధాని