మధ్యప్రదేశ్లో గంజాయి జాతికి చెందిన జనపనార (హెంప్)ను పండించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు మధ్యప్రదేశ్ మంత్రి పీసీ శర్మ వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంజాయి సాగు ప్రారంభించినట్లు తెలిపారు.
సతీవా జాతికి చెందిన ఈ గంజాయి రకం మొక్కను.. వైద్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. క్యాన్సర్ వ్యాధి నివారణకు ఉపయోగించే మందుల తయారీలో వీటిని వినియోగిస్తారు. అంతేకాక బట్టలు, బయో ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులలో ఈ రకం మొక్కలను వాడతారు.
ఈ రకం మొక్కలను ఇప్పటికే ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో పండిస్తున్నారని మంత్రి వివరించారు. ఈ గంజాయి మత్తు కోసం కాదని స్పష్టం చేసిన ఆయన...కేవలం క్యాన్సర్ మందులలో ఉపయోగించడానికేనని తెలిపారు.
'ఇది గంజాయి కాదు. దీనిని హెంప్ అని అంటారు. ఇది గంజాయి జాతికి చెందినది. భాజపా అధికారంలో ఉన్న ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈ పంటను పండిస్తున్నారు. దీనిని క్యాన్సర్ మందులలో ఉపయోగిస్తారు. బట్టల తయారీలోనూ వాడతారు. దీని వల్ల మధ్యప్రదేశ్లో కొత్త ఉద్యోగాలు వస్తాయి. ప్రపంచంలో చాలా చోట్ల ఉత్పత్తి జరుగుతోంది. దీనికోసం అంతర్జాతీయ నిపుణులతో చర్చలు జరుపుతున్నాం. ఇది తినడానికో, తాగడానికో మాత్రం కాదు.'-పీసీ శర్మ, మధ్యప్రదేశ్ న్యాయ శాఖ మంత్రి