నిర్భయ కేసు దోషులకు శిక్ష అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దిల్లీ తిహార్ జైలు అధికారులు. నలుగురు దోషులను ఉరి తీయడానికి తలారి పవన్ జల్లాద్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ దోషులకు ఫిబ్రవరి 1న శిక్షను అమలుచేయాలని కోర్టు ఆదేశించింది. శిక్ష అమలుకు రెండు రోజుల ముందుగానే... ఈనెల 30న తలారి పవన్ యూపీ మేరఠ్ నుంచి తిహార్ జైలుకు చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
పవన్ జల్లాద్ తిహార్ జైలులోని ఒక ఫ్లాట్‌లో ఉంటారని జైలు వర్గాలు వెల్లడించాయి. జైలు ప్రధాన కార్యాలయానికి కొన్ని అడుగుల దూరంలో ఉన్న సెమీ ఓపెన్ జైలులోని ఒక ఫ్లాట్ ను ప్రత్యేకంగా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ ప్లాట్‌లో ప్రస్తుతం ఉన్న ముగ్గురు ఖైదీలను మరొక గదికి తరలించినట్లు తెలిసింది.
ఉరితీసే పవన్ కోసమే ఈ ఫ్లాట్‌ను ఖాళీ చేసినట్లు తిహార్ వర్గాలు పేర్కొన్నాయి. పవన్ కోసం అన్ని వసతులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అతను తినే ఆహారం కూడా క్యాంటీన్‌లో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: సెంట్రల్ విస్టా: అన్నీ ఒక్క చోట.. దేశ రాజధాని ఘనత