కర్ణాటక తుముకూరు జిల్లాలో సౌర విద్యుత్ ఉద్యమం జరుగుతోంది. ఏటా సుమారు 300 ఎకరాల భూముల్లో కొత్తగా సౌర ప్లాంట్లు ఏర్పాటవుతున్నాయి. బీడు, సాగునీటి సౌకర్యం లేని భూములను లీజుకు ఇచ్చేందుకు రైతులు ముందుకొస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే సౌర విద్యుత్‌కు తుముకూరు ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా మారనుంది.
పావగడలో కేఎస్పీడీఎల్..
2000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పావగడ తాలూకాలో సౌర ప్లాంట్ నిర్మిస్తోంది రాష్ట్ర విద్యుత్ సంస్థ కేఎస్పీడీఎల్. నగల్మాదికె హొబ్బళి, వల్లూరు, బాలసముద్ర, తిరుమణి, రాయచర్లు, క్యాతగణచర్లలో గ్రామాల్లోని రైతుల నుంచి 13వేల ఎకరాలను 25 ఏళ్లకు లీజుకు తీసుకుంది. 11వేల ఎకరాల్లో ఇప్పటికే సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేసింది కేఎస్పీడీఎల్. నిర్మాణం పూర్తయితే... ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్క్ ఇదే కానుంది.
రైతుల నుంచి తీసుకున్న ఈ భూములకు ఎకరానికి ఏటా రూ.21 వేలు అద్దె చెల్లిస్తారు. పావగడ ప్రాజెక్టు మొత్తం 8 భాగాలుగా విభజించారు. ఒక్కో సెక్టార్ సామర్థ్యం 250 మెగావాట్లు.
"జవహార్ లాల్ నెహ్రూ జాతీయ సౌర పథకం ప్రకారం... 2022లోగా 20వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం. సౌర విద్యుత్ విధానంలో కర్ణాటక ఎప్పుడూ ముందే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం... కర్ణాటక పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ పేరిట నోడల్ ఏజెన్సీని స్థాపించింది. ప్రత్యేక ఆర్థిక జోన్లుగా సౌరవిద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం. "
-శుభ కల్యాణ్, ప్రాజెక్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి
కంపెనీల మధ్య పోటీ..
ప్రభుత్వ చొరవతో దేశంలోని ప్రముఖ కంపెనీలైన అదానీ, టాటా, ఫార్చ్యూన్, గ్లోబల్ టెక్.. ఇక్కడ ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తి చూపించాయి. రైతులు భూములు లీజుకు ఇచ్చేందుకు ముందుకు వస్తుండటం వల్ల కంపెనీల మధ్య పోటీ నెలకొంది.
ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అనుమతి కోసం చాలా కంపెనీలు అర్జీ పెట్టుకుంటున్నాయి. 10, 20 మెగావాట్ల ప్లాంట్లను ప్రారంభించేందుకూ సిద్ధపడుతున్నాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే బెస్కామ్, కేపీటీసీఎల్తో ఒప్పందం చేసుకున్నాయి. జిల్లా యంత్రాంగమూ సౌరవిద్యుత్ ప్లాంట్లపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తోంది.
జిల్లా పాలనావిభాగం ఆధ్వర్యంలో..
లీజుకిచ్చే వాటిలో సాగు భూములు లేకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సౌర విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన లీజు ప్రక్రియను జిల్లా పాలనావిభాగం సమన్వయం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం కర్ణాటక విద్యుత్ సంస్థలు కేఎస్పీడీసీఎల్, కేఆర్ఐడీఎల్ ఆధ్వర్యంలో సాగుతున్నాయి.
మైదానాల్లో ఎకరాల కొద్దీ సౌరవిద్యుత్ ప్లాంట్లు వెలుస్తున్నాయి. ఈ ప్లాంట్లు రైతులకు వరంగా మారాయి. ఉపాధితో పాటు బీడు భూముల ద్వారా ఆదాయం లభించటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు జిల్లా వాసులు.
ఇదీ చూడండి: అభాగ్యురాలి అంతిమయాత్రకు సైకిలే రథమైంది!