నవంబర్ 18 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో బుధవారం జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. నవంబర్ 18న నుంచి డిసెంబర్ 13 వరకు సమావేశాలు సాగనున్నట్లు తెసుస్తోంది.
అయితే... అధికారికంగా ఎలాంటి షెడ్యూల్ వెల్లడికానప్పటికీ దాదాపు ఇవే తేదీలు ఖరారయ్యే అవకాశముంది. గతేడాది పార్లమెంట్ వింటర్ సెషన్ 2018 డిసెంబర్ 11న ప్రారంభమై 2019 జనవరి 8 వరకు కొనసాగింది. ఈ ఏడాదిలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తి కాలం జరిగిన సెషన్ అదే.
సభ జరగనున్న కాలం, సెషన్ సిట్టింగ్‌లపై వచ్చే వారం జరగనున్న కేబినెట్ భేటీ అనంతరం.. అధికారికంగా ప్రకటించనున్నారు. అదే సమయంలో పార్లమెంట్ ఉభయసభల్లో చర్చించాల్సిన అంశాలపై కార్యాచరణ రూపొందించనున్నారు.
ఆర్డినెన్స్‌లు చట్టాలుగా...!
ఈ సమావేశాల్లో రెండు కీలక అత్యవసరాదేశాలను చట్టంగా రూపొందించాలని చూస్తోంది భాజపా. ముఖ్యంగా మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ఎదుర్కొనేందుకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్... 'దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్ను తగ్గింపు'ను చట్టంగా మార్చాలని భావిస్తోంది. ఎలక్ట్రానిక్ సిగరెట్ల ఉత్పత్తి, అమ్మకం, దిగుమతి నిషేధంపై జారీ చేసిన ఆర్డినెన్స్‌నూ చట్టంగా రూపొందించే అవకాశముంది. మరిన్ని కీలక బిల్లులను ఈ శీతాకాల సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలని చూస్తోంది ఎన్డీఏ ప్రభుత్వం.
ఇదీ చూడండి: 'బ్యాంకింగ్' పతనానికి వారిద్దరే కారణం: నిర్మల