పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ సమయానికి ఎనిమిది రోజుల ముందే ముగియనున్నట్లు తెలుస్తోంది. కరోనా భయాల మధ్య ఉభయ సభల సమావేశాలను బుధవారం వాయిదా వేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
బుధవారం ఐదు బిల్లులపై చర్చ అనంతరం రాజ్యసభ వాయిదా పడనున్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా శూన్య గంట నిర్వహించిన తర్వాత సాయంత్రం 5 గంటలకు లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. సమావేశాలను కుదించాలన్న నిర్ణయాన్ని లోక్‌సభలోని అన్ని పార్టీల నేతలకు తెలియచేసినట్లు వివరించారు.
గత కొద్ది రోజుల్లో మంత్రులతో పాటు పలువురు ఎంపీలు కరోనా బారిన పడ్డారు. మరోవైపు విపక్ష పార్టీలు 8 మంది ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాయి.
సెప్టెంబర్ 14న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సులకు చట్టరూపం ఇచ్చే బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందాయి. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1 వరకు సమావేశాలు జరగాల్సి ఉంది.