ఎలక్ట్రానిక్ సిగరెట్ల ఉత్పత్తి, తయారీ, ఎగుమతులు, దిగుమతులు, రవాణా, నిల్వ, అమ్మకాలు, ప్రకటనలు పూర్తిగా నిషేధించే బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. గత నెలలోనే లోక్సభ పచ్చజెండా ఊపిన ఈ బిల్లుకు తాజాగా రాజ్యసభ ఆమోదం తెలిపింది.
ఈ-సిగరెట్లను నిషేధిస్తూ ఈ ఏడాది సెప్టెంబర్లో ఆర్డినెన్స్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా ఆ ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు రానుంది. పార్లమెంటు ఉభయసభల ఆమోదంతర్వాత.. రాష్ట్రపతి సంతకంతో ఈ-సిగరెట్ల నిషేధ బిల్లు చట్టరూపం దాల్చనుంది.
బిల్లుపై చర్చ మధ్యలో ప్రభుత్వంపై కొందరు ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని పొగాకు సంస్థల నుంచి ఒత్తిడి ఎదురవడం వల్లే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిందని ఆరోపించారు. సంప్రదాయ పొగాకుపై కూడా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.
రూ.లక్షల్లో జరిమానా, జైలు శిక్ష
ఈ-సిగరెట్ల నిషేధ నిబంధనలు మొదటిసారి అతిక్రమించిన వారికి ఏడాది జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించేలా బిల్లులో ప్రతిపాదనలు చేశారు. అదే తప్పు పునరావృతం చేస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.ఐదు లక్షల జరిమానా విధించేలా బిల్లులో ప్రతిపాదనలు చేశారు. కొత్త చట్టం ప్రకారం ఈ సిగరెట్లను నిల్వచేసిన వారు ఆరు నెలల జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది.