'నేను ఈ లోకంలోకొచ్చి నెలరోజులైనా కాలేదు. నవమాసాలు మోసి నాకు ప్రాణం పోసిన అమ్మ వాసన తప్ప ఇంకేమీ తెలియదు. ముద్దాడేటప్పుడు నాన్న మీసం గుచ్చుకుంటేనే కందిపోయే సున్నితమైన బుజ్జి శరీరం నాది. ఆ సంగతి తెలిసినా అమ్మా నాన్నే.. నన్ను తీసుకెళ్లి లోతైన బావిలో పడేశారు. నీటిలో ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్నా కనికరించలేదు.' కర్ణాటకలో కన్నవారి చేతిలో కడతేరిన ఓ పసికందు ఆత్మఘోష ఇది.
ఉత్తర కన్నడ, యల్లాపుర, సహస్రల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ భట్, ప్రియాంక భట్ భార్యాభర్తలు. నెల రోజుల క్రితమే ఓ ఆడశిశువుకు జన్మనిచ్చింది ప్రియాంక. సుపుత్రుడు పుడతాడనుకుంటే, గుండెలపై కుంపటిలా కూతురు పుట్టిందేంటని నిరాశకు గురయ్యారు ఆ దంపతులు. బాగా ఆలోచించి ఆగస్ట్ 2న ఆ ఆడపిల్ల అడ్డు తొలగించాలనుకున్నారు.
నెల రోజులు కూడా నిండని ఆ పసికందును సొంత అమ్మానాన్నే సమీపంలోని ఓ బావిలో విసిరేశారు. బిడ్డ గుక్కపట్టి ఏడుస్తున్నా కాపాడే ప్రయత్నం చేయలేదు. పైగా తమపై అనుమానం రావద్దని.. ఎవరో తమ బిడ్డను బావిలో పడేశారంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నవజాత శిశువు ప్రాణాలు తీసే అవసరం ఎవరికుందనే కోణంలో విచారణ చేపట్టారు. ఇంట్లో ఉండే బిడ్డ.. కన్నవారికి తెలియకుండా బావి వరకు ఎలా వచ్చిందని పోలీసులకు అనుమానం వచ్చింది. ప్రియాంక, చంద్రశేఖర్ లను తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో తామే తమ కన్నబిడ్డను బావిలో పడేశామని అంగీకరించారు. ఆడపిల్ల కాబట్టే చంపేశామని ఒప్పుకున్నారు.
ఇదీ చదవండి:భారత సరిహద్దు సమీపంలో నేపాల్ హెలిప్యాడ్ల నిర్మాణం