కరోనా ఎందరో జీవితాల్లో చీకట్లను నింపింది. పానీపూరీ ప్రియుల గుండెల్లోనూ బాధను నింపింది. మనసారా పానీపూరీ తినలేక, ఇంట్లో పూరీల్లో ఆ రుచి దొరక్క తెగ ఇక్కట్లు పడుతున్నారు. అందుకే, మనుషులు తాకని పానీపూరీ-ఏటీఎం యంత్రాన్ని ఏర్పాటు చేశారు మహారాష్ట్ర ఇంజినీర్లు.
ఔరంగాబాద్‌కు చెందిన సమీర్ పిటాలే ఓ ఇంజినీరే కాదు పానీపూరీ ప్రియుడు కూడా. అయితే, ఆ ఇష్టంతోనే కొన్ని నెలల క్రితం ఓ వీధిబండి వద్ద పానీపూరీ తిన్నాడు. దాని వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ ఘటన తర్వాత చేతులతో తాకని పానీపూరీ యంత్రం తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే స్నేహితుడు ప్రతీక్ పిటాలేతో కలిసి సరికొత్త పానీపూరీ ఏటీఏంను తయారు చేశాడు. ఇందుకు దాదాపు రూ. 60 వేలు ఖర్చు అయినట్లు తెలిపాడు.
సమీర్, ప్రతీక్ కలిసి తయారు చేసిన ఈ మెషీన్లో బటన్ నొక్కగానే.. పానీపూరీ సిద్ధమై ప్లేటులో పడుతుంది. ఈ యంత్రంలో 5 రకాల పానీపూరీ ఫ్లేవర్లు లభిస్తాయి. దహీపూరీ, పానీపూరీ ఇలా ఏది కావాలన్నా బటన్ నొక్కితే చాలు అంటున్నారు ఆ ఇంజినీర్లు.
ఇదీ చదవండి: రూ.1 జరిమానా చెల్లించిన భూషణ్