తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఆక్స్ఫర్డ్ టీకా.. రెండు, మూడోదశ మానవ ప్రయోగాలకు సిద్ధమవుతోంది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ). ఈ నేపథ్యంలో క్లినికల్ ట్రయల్స్‌కు సీరంకు అనుమతించాలని కొవిడ్-19పై ఏర్పాటైన సీడీఎస్సీఓకు చెందిన నిపుణుల కమిటీ భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కి సిఫారసు చేసింది.
నిపుణుల ప్యానెల్ మంగళవారం సీరం సంస్థ దరఖాస్తుపై చర్చలు జరిపి కొంత అదనపు సమాచారం జోడించటం, సవరణలు చేయాలని కోరింది. ఆ తర్వాత బుధవారం సంస్థ సవరించిన ప్రతిపాదనను సమర్పించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
" సీరం దరఖాస్తును పరిశీలించేందుకు కొవిడ్-19పై ఏర్పాటైన నిపుణుల కమిటీ శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. పలు విషయాలపై చర్చించిన తర్వాత ఆక్స్ఫర్డ్ టీకా కొవిషీల్డ్ -2,3 దశల మానవ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి మంజూరు చేయాలని సిఫారసు చేసింది. క్లినికల్ ట్రయల్స్‌లో వయోజనుల్లో కొవిషీల్డ్ భద్రత, రోగ నిరోధక శక్తిని గుర్తించనున్నారు."
- అధికార వర్గాలు.
రెండు, మూడు దశల ట్రయల్స్ నిర్వహణ విధానాన్ని స్పష్టంగా నిర్వచించాలని, కమిటీ అధ్యయనం కోసం ధరఖాస్తును తిరిగి సమర్పించాలని డీసీజీఐ.. మంగళవారం సీరం సంస్థను కోరింది.
సీరం సంస్థ పంపిన సవరించిన ప్రతిపాదన ప్రకారం.. 1,600 మంది 18 ఏళ్లకుపైబడిన వారు ట్రయల్స్‌లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నారు. ఎయిమ్స్ దిల్లీ, బీజే వైద్య కళాశాల పుణె, ఆర్‌ఎంఆర్‌ఐఎంఎస్ పట్నా, ఎయిమ్స్ జోధ్‌పుర్ వంటి 17 ఎంపిక చేసిన కేంద్రాల్లో ట్రయల్స్ నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: నవంబర్ నాటికి ఆక్స్ఫర్డ్ టీకా.. ధరెంతంటే?