భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన 'కొవాగ్జిన్ టీకా'కు సంబంధించి మూడో దశ క్లినికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతులిచ్చింది.
జంతువులతోపాటు మనుషులపై జరిగిన ఒకటి, రెండు దశల పరీక్షల ఫలితాలను అనుసరించి మూడో దశకు అనుమతులు మంజూరు చేసింది. క్లినికల్ ట్రయల్స్ తొలి దశలో 45 మందికి, రెండో దశలో 55 మందికి నిమ్స్‌లో టీకా ఇవ్వగా.. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. యాంటీ- బాడీలు కూడా అభివృద్ధి చెందాయని చెప్పారు.
6 నెలలు పర్యవేక్షణ..
మొదటి, రెండో దశలో మొత్తం 100 మంది వలంటీర్లు ఇందులో భాగస్వామ్యమైనట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు టీకా తీసుకున్న వారిలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వివరించారు. దాదాపు ఆర్నెల్లపాటు వలంటీర్ల ఆరోగ్యంపై పర్యవేక్షణ కొనసాగుతోందని అన్నారు.
మూడో దశ క్లినికల్ పరీక్షల్లో భాగంగా నిమ్స్‌లో మరో 200 మందికి టీకా ఇచ్చే అవకాశముందని వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి: '2వ దశ క్లినికల్ పరీక్షల పూర్తి సమాచారం ఇవ్వండి'