ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం (యూఎన్హెచ్ఆర్సీ)లో పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బతగిలింది. కశ్మీర్ అంశాన్ని రాజకీయం చేయాలన్న పాక్ ప్రయత్నాలు బెడిసికొట్టినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. పాక్ వాదనలను యూఎన్హెచ్ఆర్సీ తిరస్కరించినట్లు ప్రకటించింది.
తప్పును పదేపదే చెబితే నిజం కాదన్న విషయాన్ని పాకిస్థాన్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్. ఐరాసలో పాక్ చెప్పిన అబద్ధాలపై భారత్ దీటుగా బదులిచ్చిందని తెలిపారు.
" కశ్మీర్ అంశాన్ని రాజకీయం చేయాలన్న పాక్ ప్రయత్నం తిరస్కరణకు గురైంది. ఉగ్రవాదులను పెంచి పోషించి, వారికి సహకరించే విషయంలో పాకిస్థాన్ పాత్ర గురించి అంతర్జాతీయ సమాజానికి స్పష్టమైన అవగాహన ఉంది. ఉగ్రవాదానికి కేంద్రంగా మారిన దేశం మానవ హక్కులపై ప్రపంచ సమాజం తరఫున మాట్లాడటం విడ్డూరంగా ఉంది."
- రవీశ్ కుమార్, భారత విదేశాంగ శాఖ ప్రతినిధి.
ఐరాస మానవహక్కుల మండలిలో ఇరుదేశాల మధ్య కశ్మీర్ అంశంపై మాటల యుద్ధం జరిగిన రెండు రోజుల తర్వాత ఈ మేరకు స్పందించారు రవీశ్ కుమార్.
ఇదీ చూడండి: అంతరిక్షంలో సిమెంట్ మిక్స్ చేసిన వ్యోమగాములు!