గూఢచర్యం ఆరోపణలపై పాక్ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ వ్యవహారంలో.. పాక్ వైఖరిలో కొద్దిగ మార్పు వచ్చింది. తమ అధికారులు లేకుండా కుల్‌భూషణ్‌ను కలిసేందుకు భారత దౌత్యాధికారులకు అవకాశం కల్పించింది. కుల్‌భూషణ్‌ను గురువారం అధికారులు కలిసేందుకు వెళ్లగా.. పాక్ అధికారులు అక్కడ ఉండడం పట్ల భారత్ అభ్యంతరం లేవనెత్తింది. అడ్డంకులు, అవరోధాలు లేని భేటీ విషయంలో అంతర్జాతీయ చట్టాలను పాక్ ఉల్లంఘిస్తోందని భారత్ ఆరోపించింది.
ఈ నేపథ్యంలో మూడోసారి భేటీకి తమ దేశ అధికారులు లేకుండానే భేటీకి అవకాశం ఇస్తున్నట్లు పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి శుక్రవారం వెల్లడించారు.
పాక్ ఏజెంట్లు 2016లో కుల్‌భూషణ్‌ను ఇరాన్ నుంచి అపహరించారు. గూఢచర్యం కేసులో 2017 ఏప్రిల్‌లో పాక్ సైనిక కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. దానిని సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది భారత్. 2017 మే 18న కోర్టు మరణశిక్షపై స్టే విధించింది.
రెండు దేశాల వాదనలు విన్న న్యాయస్థానం సరైన సాక్ష్యాధారాలు సమర్పించే వరకు ఉరిశిక్షను నిలుపుదల చేస్తూ 2019 జులై 17న తీర్పు ఇచ్చింది. ఐసీజే ఆదేశాల ప్రకారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు భారత్ ముందుకు వచ్చింది. అందుకు జాదవ్ నిరాకరిస్తున్నారని పాక్ కథలు చెప్పడం వల్ల కుల్‌భూషణ్‌ను కలిసేందుకు దాయాది అనుమతి కోరింది భారత్. ఈ నేపథ్యంలో గురువారం రెండోసారి భేటీ జరిగింది. కుల్‌భూషణ్ ఒత్తిడిలో ఉన్నారని, ఆయనతో మాట్లాడేందుకు ఆ దేశం స్వేచ్ఛనివ్వడం లేదని ఈ సందర్భంగా భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: కుల్‌భూషణ్‌కు దౌత్య సాయంతో పాక్ మళ్లీ వక్రబుద్ధి