జమ్ముకశ్మీర్‌లోని అవంతిపొరలో ఉగ్రదాడికి అవకాశం ఉందని పాకిస్థాన్ నిఘా వర్గాలు భారత్‌ను అప్రమత్తం చేశాయి. స్పందించిన ప్రభుత్వం కశ్మీర్‌వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. బిష్కెక్లో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సుకు ముందు ఈ నిఘా సమాచారాన్ని పాక్ అందించినట్లు సమాచారం. ఈ విషయాన్ని అమెరికాకూ తెలిపింది పాకిస్థాన్.
పుల్వామాలో పాక్ ప్రేరేపిత జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అదే రీతిలో అవంతిపొరలో దాడికి యత్నించవచ్చని పాక్ హెచ్చరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
గత నెల 24న పుల్వామా జిల్లాలో ఆల్‌ఖైదాతో సంబంధాలున్న ఉగ్రవాద ముఠా అన్సార్ గజావత్ ఉల్ హింద్ కమాండర్ జకీర్ మూసాను భద్రతా దళాలు కాల్చిచంపాయి. ఇందుకు ప్రతీకారంగా విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాదులు కుట్రపన్నుతున్నాయన్నది పాక్ నిఘా వర్గాల సమాచారం. అయితే దాడికి సంబంధించి కచ్చితమైన వివరాలు పాక్ ఇవ్వలేదని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత.... ఎవరు?