ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ వైమానిక దాడుల ద్వారా భారత్ గట్టి సమాధానం ఇచ్చిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. సరిహద్దు వెంబడి ఉగ్రచర్యలకు పాల్పడే ముందు దాయాది దేశం ఒకటికి 100 సార్లు ఆలోచించాలని హెచ్చరించారు.
పుల్వామా దాడులకు ప్రతిస్పందనగా.. సరిహద్దు వెంబడి శత్రుదేశంపై వైమానిక దాడులు జరిపేందుకు బలవంతంగా తమ సిద్ధాంతాలను మార్చుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
మున్ముందు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడాలని చూసినా తమ ప్రభుత్వం దీటైన సమాధానం చెబుతుందని పేర్కొన్నారు రాజ్‌నాథ్. పుల్వామా దాడి అనంతర పరిణామాలతో.. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని నిరూపితమైనట్లు స్పష్టం చేశారు. ఉగ్రవాద నిరోధానికి భారత్ కృషి చేస్తుందని పేర్కొన్నారు.
పుల్వామా ఘటనపై ఆగ్రహంతో...
జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఫిబ్రవరి 14న జైషే మహమ్మద్ చేసిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఈ దాడికి ఆగ్రహించిన భారత్.. పాకిస్థాన్‌లోని బాలాకోట్ ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు చేసి దీటైన సమాధానం ఇచ్చింది.
ఉరీ సెక్టార్లో దాడి అనంతరం.. 2016లో సెప్టెంబర్ 29న పాక్ సైనిక శిబిరాలపై తొలిసారి సర్జికల్ స్ట్రైక్స్(మెరుపు దాడులు) చేసింది భారత సైన్యం.
ఇదీ చూడండి: ఆసక్తికర సన్నివేశం: అమిత్‌షాతో దీదీ విందు