భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను విడుదలచేసి వెంటనే అప్పగించాలని భారత్ డిమాండ్ చేసింది. జాదవ్ మరణశిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ హర్షం వ్యక్తం చేశారు. జాదవ్‌ను క్షేమంగా తీసుకొచ్చేందుకు నిర్విరామంగా కృషి చేస్తామన్నారు.
ఐసీజే తీర్పు నేపథ్యంలో పార్లమెంటు ఉభయసభల్లో ఈ అంశంపై ప్రకటన చేశారు విదేశాంగ మంత్రి జైశంకర్. జాదవ్ అమాయకుడన్నారు. న్యాయ ప్రక్రియ లేకుండా బలవంతంగా తప్పు అంగీకరించేలా చేసినంత మాత్రాన వాస్తవం మారబోదని స్పష్టం చేశారు. జాదవ్ విషయంలో ఆయన కుటుంబ సభ్యులు చూపిన ధైర్య సాహసాలను జైశంకర్ ప్రశంసించారు.
" బుధవారం అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కేవలం భారత్‌కు, కుల్‌భూషణ్ జాదవ్‌కు మాత్రమే కాదు, చట్టాన్ని, అంతర్జాతీయ ఒప్పందాల పవిత్రతను విశ్వసించే వారికి కూడా సమాధానమే. అంతర్జాతీయ న్యాయస్ధానంలో న్యాయమార్గంలో పోరాడటం సహా జాదవ్ విడుదల కోసం కేంద్ర ప్రభుత్వం అలుపెరుగకుండా శ్రమించింది. హరీశ్ సాల్వే నేతృత్వంలోని న్యాయబృందం సహా జాదవ్ విషయంలో పని చేసిన వారందరినీ ప్రశంసించడానికి సభ ముందుకు రాగలదని నేను నమ్ముతున్నాను. జాదవ్‌ను త్వరగా విడుదల చేసి భారత్‌కు పంపించాలని మరోసారి పాకిస్థాన్‌ను కోరుతున్నాను. జాదవ్ క్షేమంగా ఉండడానికి, ఆయన త్వరగా భారత్‌కు రావడానికి ప్రభుత్వం తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని భరోసా ఇస్తున్నా. "
- జైశంకర్, విదేశాంగ మంత్రి
ఉపరాష్ట్రపతి హర్షం...
కుల్‌భూషణ్ జాదవ్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును రాజ్యసభ సభ్యులందరూ స్వాగతించటంపై సంతోషం వ్యక్తం చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. జాదవ్‌ను నిర్ధోషిగా విడుదల చేసేంతవరకు భారత్ పోరాడుతూనే ఉంటుందన్నారు.
ఇదీ చూడండి: 'కుల్‌భూషణ్ జాదవ్ కేసు తీర్పులో సత్యమేవ జయతే'