డబ్బుంటేనే మాటకు విలువనిచ్చే సమాజం ఇది. రూపాయి అప్పు పుట్టాలంటే మాటలు కాదు. అలాంటిది ఓ తండ్రి 60 లక్షలు అప్పుచేశాడు. తీర్చకుండానే కాలం చేశాడు. తండ్రి చేసిన 60 లక్షల అప్పును 20 ఏళ్ల తర్వాత తిరిగి చెల్లించాడు ఓ వ్యక్తి. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లా రావత్‌సర్‌లో జరిగిందీ సంఘటన.
దిల్లీలో ఓ యువ వ్యాపారి సందీప్ జమాలియా. 20 ఏళ్ల కిందట రాజస్థాన్ రావత్‌సర్‌లో నివసించేది ఆయన కుటుంబం. తండ్రి మిత్ర్ రామ్ జమాలియా రావత్సర్ మార్కెట్ అధ్యక్షుడిగా పనిచేస్తుండేవాడు. వ్యాపారం కోసం మిత్ర్రామ్ కొంతమంది వద్ద 20 లక్షలు అప్పు చేశాడు. అనంతరం ఆయన వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయి ఆర్థికంగా చితికిపోయాడు. ఈ కారణంగా రావత్సర్నే కాదు రాజస్థాన్‌ను విడిచి వెళ్లిపోయాడు. అప్పు తీర్చాలన్న ఆలోచనతో జీవిత కాలం గడిపి చనిపోయాడు మిత్ర్రామ్.
తండ్రి కోరిక మేరకు..
తన తండ్రి ఆఖరి కోరిక, స్వగ్రామాన్ని వీడేందుకు కారణం అప్పు తీర్చకపోవడమే అని మిత్ర్రామ్ కుమారుడు సందీప్ మనస్సులో బలంగా నాటుకుపోయింది. వ్యాపారంలో సంపాదించిన సొమ్ముతో రావత్సర్ చేరుకుని, తన తండ్రికి అప్పు ఇచ్చిన వారి బాకీ తీర్చేశాడు.
"2001 సంవత్సరంలో మా నాన్న రావత్సర్ మార్కెట్ అధ్యక్షుడిగా ఉండేవారు. నా వయస్సు అప్పుడు 12 ఏళ్లు. మాకు వ్యాపారంలో నష్టం వచ్చింది. అప్పు చేసిన మొత్తాన్ని చెల్లించకుండా రావత్సర్ను వీడాం. అప్పటినుంచి అప్పులు తీర్చాలన్నది నా కల. మా నాన్న లక్ష్యం కూడా ఇదే. ఆయన స్వప్నాన్ని తీర్చాను."
-సందీప్ జమాలియా, అప్పు తీర్చిన వ్యక్తి
'చిరునామా తెలియని వారిని వెతికి చెల్లిస్తా!'
తన తండ్రికి అప్పు ఇచ్చి అందుబాటులో ఉన్న ప్రతీ ఒక్కరికీ బాకీ తిరిగి చెల్లించాడు సందీప్. ప్రస్తుతం వివరాలు తెలియని వారి చిరునామాలు లభించిన అనంతరం వారికీ నయాపైసాతో సహా తిరిగి చెల్లిస్తానని వెల్లడించాడు.
ఇదీ చూడండి: 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై అమిత్ షా గురి