ప్రముఖ సామాజిక కార్యకర్త, ఛాయ్‌వాలా, పద్మశ్రీ డి. ప్రకాశ్ రావు(63) బుధవారం కన్నుమూశారు. కరోనా కారణంగా డిసెంబరు 25న కటక్‌లోని ఎస్సీబీ ఆస్పత్రిలో చేరిన ఆయన బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మృతి చెందారని కుటుంబసభ్యులు వెల్లడించారు.
ఛాయ్‌వాలాగా పేరుగాంచిన దేవరపల్లి ప్రకాశ్ రావు 40 ఏళ్లపాటు కటక్‌లోని పేద రోగులకు సాయం అందించారు. తేనీరు విక్రయంతో వచ్చిన సంపాదనతో కటక్‌లోని మురికివాడల్లో చిన్నారులకు విద్య, ఆహారం అందించి ఆయన ప్రశంసలు అందుకున్నారు.
ఆయన మన తెలుగువారే..
130 ఏళ్ల క్రితం ప్రకాశ్‌రావు పూర్వీకులు ప్రకాశం జిల్లా నుంచి వెళ్లి కటక్‌లో స్థిరపడ్డారు. దీంతో ప్రకాశ్‌రావు అక్కడే టీ స్టాల్ నడుపుతూ తనకు వచ్చిన ఆదాయంలో సగం మొత్తాన్ని వెచ్చించి కటక్‌లో 'ఆశా ఓ ఆశ్వాసన' అనే పాఠశాలను కూడా నడిపి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. 1978 నుంచి 200 సార్లుకు పైగా రక్తదానం చేయడం, పేదలను ఆదుకోవడం.. ఇలా అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌లో ప్రకాశ్‌రావు పేరును ప్రస్తావిస్తూ చేసిన సేవలను కొనియాడారు. అంతేకాకుండా ఒడిశా పర్యటనకు వెళ్లిన సందర్భంలో కూడా ఆయనను కలిశారు.
ఇదీ చదవండి : లోరీ మంటల్లో సాగు చట్టాల ప్రతులు!